రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ అందించిన సేవలు సదాస్మరణీయం జిల్లా కలెక్టర్ బదావత్ సంత

Published: Saturday April 15, 2023
మంచిర్యాల బ్యూరో,  ఏప్రిల్ 14, ప్రజాపాలన:
 
భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా సంఘ సంస్కర్తగా రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజలకు అందించిన సేవలు సదా స్మరణీయమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం డా. బి. ఆర్. అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఐ.బి. చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి జిల్లా అదనపు కలెక్టర్లు డి. మధుసూదన్ నాయక్, బి. రాహుల్, దళిత సంఘాల నాయకులతో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల వలన నేడు మనం స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నామని అన్నారు. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని, స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారని తెలిపారు. వివిధ దేశాల నుండి విశ్వవిద్యాలయాల ద్వారా డాక్టరేట్ పట్టాలు పొంది న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో దేశానికి ఎన్నో సేవలు అందించారని తెలిపారు. అంబేద్కర్ మరణానంతరం ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1990లో అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్నను అందించి గౌరవించుకోవడం జరిగిందని, అంబేద్కర్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నామని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు పాటిస్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.