ప్రమాదంలో జీవవైవిధ్యం పంటలలో వంటలలో వైవిధ్యత లేకపోతే అనర్థదాయకం

Published: Tuesday February 21, 2023

డాక్టర్  ముచ్చుకోట  సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజాసైన్స్  వేదిక.

 పంటలలో వైవిధ్యత ఉంటే భూములు బాగుంటాయి, వంటలలో వైవిధ్యత ఉంటే మనుషులు బాగుపడతారు.  జీవ సమాజంలో జీవుల మధ్య ఉన్న విభిన్నతను  జీవ వైవిధ్యం అంటాము. జీవుల సంఖ్య, భిన్నత్వం, మార్పు చెందే తత్వాలన్నీ  జీవవైవిధ్యానికి సంబంధించినవే. జీవన వైవిధ్యం ప్రధానంగా  జన్యు పరమైన, జాతిపరమైన, ఆవరణ వ్యవస్థల జీవన వైవిధ్యం.   ప్రకృతిలో సహజంగా, కాలానుగుణంగా వచ్చిన మార్పుల వలన కొన్ని జాతులు అదృశ్యమై, మరికొన్ని కొత్తజాతులు ఆవిర్భవిస్తాయి. ప్రస్తుతం ప్రకృతిలో వస్తున్న మార్పులను తట్టుకోలేక ఎన్నో జీవజాతులు అంతరించి పోతున్నాయి. దీనికి ప్రధాన కారకుడు మానవుడు, విధ్వంసకరమైన  అభివృద్ధి పేరిట మానవుడు  చేస్తున్న చేష్టలు. మానవుడు జరిపే ప్రకృతి ప్రతికూల చేష్టల వలన ఏటా కొన్ని వందల జాతులు అంతరించి పోతున్నాయి. ప్రధానంగా భౌగోళిక, జీవావరణ మార్పుల వలన ఇప్పటివరకు ఐదుసార్లు జీవవైవిధ్యం చాలావరకు అంతరించిపోయింది. మళ్లీ పరిణామం చెందుతూ వచ్చింది. ఇదంతా అనేక లక్షల ఏళ్ల కాలంలో జరిగింది. దాదాపు 350 సంవత్సరాల క్రితం ఐరోపా ఖండంలో మొదలైన పారిశ్రామిక విప్లవం ప్రపంచమంతా వ్యాపించి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడి తద్వారా మానవ జనాభా 18 రెట్లు పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానంతో సగటు జీవన ప్రమాణాలు మెరుగు పడి మానవుడు అవసరాలు విపరీతంగా పెరిగింది. పెరిగిన ఆ అవసరాల నిమిత్తం సహజ వనరులు మట్టి, నీరు, గాలి, జంతు, వృక్షజాతులను అస్థిరమైన పద్ధతిలో వినియోగించుకుని పర్యావరణాన్నీ, జీవ వైవిధ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ ‘మానవ చర్య’ అణుయుద్ధం కన్నా తీవ్రమైనదని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఒక జాతి నశిస్తే మనిషి దాన్ని తిరిగి సృష్టించ లేడు. జీవ వైవిధ్యం దెబ్బతింటే పర్యావరణానికే ముప్పు ఏర్పడుతుంది. జీవుల మధ్య ఆహారగొలుసు దెబ్బతిని ప్రాణులన్నింటికీ ప్రమాదం వాటిల్లుతుంది. భూమిపై ఆహారపంటలు, ఫలాలు, ఔషధాలు ఇచ్చే 90 శాతం మొక్కలకు కీటకాలు, పక్షులు పరాగ సంపర్క సహకారాలుగా ఉంటాయి. మొక్కలు నశిస్తే వాటిమీద ఆధారపడిన జంతువులు నశిస్తాయి. పక్షులు నశిస్తే మొక్కలు పెరగడం, పంటలు పండటం ఆగిపోతుంది. అంతిమంగా ఏ జీవికైనా ఆహారోత్పత్తి దెబ్బతిని మనుషుల మనుగడకే ముప్పు వాటిల్లుతుంది.  నాగరికత నేర్చిన మానవుడి విచక్షణారాహిత్యం వల్ల ఈ జీవ వైవిధ్యం ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నది. ఏటా కీటక జనాభాలో 2.5 శాతం క్షీణత కలుగుతున్నది. ఫలితంగా అనేకచోట్ల పంటల దిగుబడి తగ్గుతున్నదని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. పర్యావరణ సమతుల్యత అంటే ప్రకృతి వనరులనే కాకుండా, అమూల్యమైన జంతుజాలాన్ని కాపాడుకోవడం. జీవ వైవిధ్యం జాతీయ సంపదకు సూచిక వంటిది. మానవ వికాసానికి చోదకశక్తిగా పనిచేస్తుంది. ప్రపంచంలో 2.3 శాతం భూభాగంలో 12 శాతం జీవ వైవిధ్య జాతులకు నిలయంగా ఉన్న భారత్‌లో కూడా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 60 శాతం ఉభయచరాలు, 47 శాతం సరీసృపాలు ప్రమాదపుటంచుకు చేరుకున్నాయి. కొన్ని జీవరాసులు నశించినా వాటి ప్రభావం అన్ని జీవుల మీద పడుతుంది. దాంతో పర్యావరణం దెబ్బతిని ఆ దుష్ఫలితం మనుషుల మీద పడుతుంది. ఏ దేశంలోనైతే జీవ వైవిధ్యం కాపాడబడుతుందో ఆ దేశం సమృద్ధిగా ఉంటుంది. జీవ వైవిధ్యం దెబ్బతినడానికి ప్రధాన కారణం అడవులపై మనిషి దృష్టిపడటమే. అడవుల్లో అణువిద్యుత్‌ కేంద్రాలు, ఖనిజాల తవ్వకం జరగటం వల్ల జంతుజాలం కనుమరుగవుతున్నది. ప్రతి జీవికి జీవించే హక్కున్నది. కానీ ఇష్టానుసారంగా చేపలు, ఇతర జంతువుల వేట, మితిమీరిన ప్లాస్టిక్‌ వాడకం, వ్యవసాయ ఉత్పత్తుల కోసం యంత్రాల వాడకం, శిలాజ ఇంధనాలను మండించడం, గనుల తవ్వకం, కర్బన ఉద్గారాలు జీవ వైవిధ్య విధ్వంసానికి ప్రధాన కారణాలు.మనిషి మనుగడకు కీలకమైన జీవ వైవిధ్యానికి పొంచి ఉన్న మాదాల గురించి ఒకసారి సమీక్షించుకుందాం. ప్రపంచ జనాభా విపరీతంగా పెరుగుతున్నది. మానవ అవసరాల కోసం, పరిశ్రమల కోసం, నివాస గృహాల కోసం అడవులను నరికి వేయడం, సహజ ఆవాసాలను మార్చడం సర్వసాధారణమైంది. దీనితో వృక్ష, జంతుజాతులు అంతరించిపోతున్నాయి. జీవ సంపద తగ్గిపోతుంది. పరిశ్రమలు, వాహనాల వలన వాతావరణంలోకి, నీటిలోకి అనేక హానికర రసాయనిక పదార్థాలు చేరి వృక్ష, జంతుజాతుల మనుగడకు ముప్పు ఏర్పడింది. వ్యవసాయంలో వాడే క్రిమిసంహారక, కలుపు నివారణ రసాయన మందులు, రసాయన ఎరువులు, భారీ రసాయన మూలకాల వలన వాతావరణ, భూమి, నీటి కాలుష్యం జరిగి అనేక వృక్ష, జంతుజాతుల మనుగడకు ప్రమాదం సంభవిస్తున్నది. సునామీలు, తుపానులు, వరదలు, భూకంపాలు, అడవులకు నిప్పు పెట్టడం, అగ్నిపర్వతాల వలన సహజ ఆవాసాలు దెబ్బతిని జీవవైవిధ్యం తగ్గుతున్నది. జీవ కాలుష్యకాల బెడద కూడా ఉంది. విదేశీ జాతులతో ఇది సంభవిస్తున్నది. వాటిని తేవడం వలన స్థానిక జాతులకు ప్రమాదం సంభవిస్తుంది. ఉదా:పార్థీనియం, తుంగ, గరిక,   లంటానా, ఐకొర్నియా, ప్రోసోపిస్ప్రకు చెందిన జాతులు స్థానిక జాతుల వృద్ధిని అడ్డుకుంటున్నాయి. ఇవే జీవ కాలుష్యకాలు.అందుకే ప్రపంచదేశాలు కలిసికట్టుగా జీవ వైవిధ్య సంరక్షణ చేపట్టాలి. జీవ సంపద, వాటి వనరులను ప్రస్తుత అవసరాలకు తగినంత ఉపయోగించుకొని భావితరాలకు కూడా లభించే విధంగా కాపాడటాన్ని జీవ వైవిధ్య సంరక్షణ అంటారు. ప్రపంచంలో భారతదేశం 12వ మెగా జీవ వైవిధ్యం కలిగిన దేశం. ప్రపంచంలో 2.5% భౌగోళిక వైశాల్యం కలిగి, 7.8% వైవిధ్యం ఇక్కడ ఉంది. 1972లో వన్యమృగ సంరక్షణ చట్టాన్ని తీసుకువచ్చారు.1982 లో జాతీయ వన్యమృగ బోర్డును ఏర్పరిచారు. వన్యమృగ సంరక్షణ సవరణ చట్టాన్ని 2006 ఆమోదించారు. 2002లో జాతీయ జీవవైవిధ్య చట్టం చేశారు. 2003 అక్టోబర్‌ 01 ‌తేదీ నుంచి ఇది అమలులోకి వచ్చింది. ఈ చట్టం కిందకు జాతీయ జీవవైవిధ్య ఆధారిటీ (NBA), జాతీయ జీవవైవిధ్య బోర్డు (SBB), జీవవైవిధ్య నిర్వహణ కమిటీ (BMCs) వస్తాయి.జాతీయ జీవవైవిద్యం ప్రాధికారసంస్థఇది భారతదేశ కేంద్ర ప్రభుత్వ వాతావరణం, అడవుల మంత్రిత్వశాఖ, ఆధ్వర్యంలో పనిచేస్తుంది. జాతీయ జీవవైవిధ్య ఆధారిటీ సంస్థనూ చట్టబద్ధ హోదాతో చెన్నైలో 2003లో ఏర్పాటు చేశారు. జీవసంపద దొంగలించకుండా జాగ్రత్తపడడం, రక్షిత ప్రదేశాల బయట కూడా జీవవైవిద్య రక్షణకు నియమాలు  రూపొందించి వాటిని అమలుపరచడం వంటివి దీని బాధ్యతలు. రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్‌ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటల సాగు ద్వారా పంట మార్పిడి విధానాన్ని ఎంచుకోవాలి. అలాగే  తృణధాన్యాలు పండించి  ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  పంట మార్పిడి  అనగా మట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరచి, సారవంతం చేసి మరియు తీవ్రమైన తెగులు తెగుళ్లు, కలుపు సమస్యలను అదుపులో పెట్టడానికి ఒకే భూమిలో వివిధ రకాల పంటలను వరుసగా పండించడం. పంట మార్పిడి చేయడం ద్వారా పొలంలో తెగుళ్ళు మరియు చీడ పీడలు వృద్ధి చెందటానికి ప్రతికూల పరిస్థితిలు ఏర్పడి తీవ్రతను తగ్గిస్తుంది తద్వారా పంట నష్టం అంతగా ఉండదు.పంట మార్పిడి లో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటల్ని ఎంపిక చేసుకోవాలి. శనగ, బొబ్బెర, పెసర, మినుము   వంటి పంటల్ని   వేసుకోవడం వళ్ళ  నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి దీని వల్ల కలుపు మొక్కలను నివారించవచ్చు. రైతులు అధిక దిగుబడి, లాభాల కోసమో వేసిన పంటనే మళ్లీ వేస్తూ ఉంటారు. కొంతమంది రైతులు పక్కవారు అదే పంట వేస్తున్నారని వేసిన పంటే మళ్లీ మళ్లీ వేస్తూ ఉంటారు. ఇక ఒకే పంటకు ఎక్కువ రేటు ఉందని అదే పంట ప్రతి ఏడాది వేస్తూ ఉంటారు. కానీ దీని వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయి. పంట ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి, దీనిపై రైతులకు అవగాహన కల్పించాల్సిన ఉంది. 
ఆహారం తీసుకోవడంలో సమతుల్యతా, వైవిధ్యం, పరిమితంగా ఉండగలగడంఅనేవి, ఆరోగ్యంగా ఆహారం తీసుకునే, పద్ధతులు అని వైద్యులు చిరకాలంగా చెబుతున్నారు. అంటే, శృతిమించిన స్థాయిలో కేలరీలు లేదా ఒకే తరహా పోషకాన్ని అతిగా తీసుకోకుండా వైవిధ్య భరితం అయిన ఆహారాన్ని తీసుకోవాలని వారి సలహా. వైవిధ్యంతో కూడిన పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోవాలి. మంచి ఆరోగ్యానికి  దరిదాపుగా 40 రకాలు అయిన చిన్న పోషకాలు కావాలి. ఏ ఒక్కతరహా ఆహారమూ  వాటిని ఇవ్వలేదు. రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సినవి పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు లేదా పదార్థాలు; శాకాహారులు కాకుంటే మాంసం ఉత్పత్తులయిన చేపలు, చికెన్‌, ఇతర మాంసకృత్తులు, అలాగే తృణధాన్యాలు వంటివి. ఈ తరహా ఆహారాలను, ఏ మోతాదులో తీసుకోవాలి అనేది మనిషికి  అవసరం అయ్యే కేలరీల స్థాయిని బట్టి వుంటుంది. సాధ్యమైనంత ఎక్కువగా తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.  సమతుల శరీర బరువును కొనసాగించాలి. శరీరం బరువు ఎంత వుండవచ్చుననేది, పలు అంశాలపై ఆధారపడి వుంటుంది. ఉదాహరణకు: మీరు పురుషులా, స్త్రీలా, ఎత్తు, వయస్సు, వారసత్వం లేదా జన్యువుల వంటి అంశాలు ప్రధానమైనవి. స్థూలకాయం వలన పలు వ్యాధులు రావచ్చు. మచ్చుకు: రక్తపోటు, హృద్రోగాలు, మధు మేహం, కొన్నిరకాల క్యాన్సర్లు మొదలైనవి చెప్పుకోవచ్చును. అయితే, దీనితో పాటుగా మీ శరీరం వుండాల్సినంత బరువును కలిగి లేకపోవడం కూడా ప్రమాదమే. దీనివలన: ఎముకల సమస్యలు, బుుతుస్రావ సమస్యల వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చును. కాబట్టి మీ శరీరంబరువు అతిగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా వైద్యుల సలహాతో మీ ఆహార అలవాట్లను మార్చుకోండి. అలాగే, క్రమం తప్పని వైద్యం కూడా శరీరం బరువును తగిన స్థాయిలో ఉంచుకోగలిగేటందుకు ప్రధానం. పరిమితంగా, వైవిధ్యంతో ఆహారాన్ని తీసుకోవాలి. ఏ ఒక్క ఆహార పదార్థాన్ని శృతిమించి తీసుకోకుంటే, భిన్నమైన ఆహార పదార్థాలను  క్రమం తప్పకుండా, తీసుకోగలుగుతారు. సమయ బద్ధంగా ఆహారం తీసుకోవాలి,  తగిన సమయంలో, తగినంత ఆహారం తీసుకోకపోవడం వలన శృతిమించి ఆకలి ఏర్పడి తిన్నప్పుడు ఒకసారి, అతిగా తినే అవకాశం ఉంది. శృతిమించిన ఆకలితో ఆహారపు పౌష్ఠిక విలువల గురించి విస్మరించే ప్రమాదం ఉంది. భోజనానికి భోజనానికి నడుమ అల్పాహారం మంచిదే అయినా, అల్పాహారాన్ని అతిగా తీసుకుంటే అదే పూర్తిస్థాయి భోజనంగా తయారవ్వగలదు.భారత ప్రభుత్వం జీవవైవిధ్య చట్టానికి అనుగుణంగా జిల్లాల్లో  జీవ వైవిధ్య మండళ్లు ఏర్పాటు చేయాలి. జీవ వైవిధ్య సంరక్షణ, సుస్థిర వినియోగానికి సంబంధించిన విషయాలపై  ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం, జీవవనరుల వినియోగం ద్వారా సమకూరే ప్రయోజనాల న్యాయబద్ధ పంపిణీ మొదలైనవి  జీవ వైవిధ్య మండలి ప్రధాన ఉద్దేశాలు. ఇంకా, దేశంలో  వివిధ వ్యవసాయ వాతావరణ ప్రదేశాలలో సంప్రదాయకంగా సాగు చేసే పంటల రకాలను పునరుద్ధరించడం ప్రోత్సహించడం, నీటిసంరక్షణ, చెట్లపెంపకం, సేంద్రియ వ్యవసాయం, నగర సుందరీకరణ, నగర జీవ వైవిధ్య సూచిక తయారు చేయడం వంటి విషయాల్లో  ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం జీవ వైవిధ్య మండలి బాధ్యత.