మండలంలో బీభత్సం సృష్టిస్తున్న కోతులు అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజ

Published: Saturday December 10, 2022

బోనకల్, డిసెంబర్ 9 ప్రజా పాలన ప్రతినిధి :మండలంలో పలు గ్రామాల్లో కోతులు చేస్తున్న వీరంగం అంతా ఇంతా కాదు.. ఊళ్లు, గ్రామాలపై పడి వానరాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మండల కేంద్రంతో పాటు చుట్టూ ఉన్న గ్రామాల్లో వానరాల బెడద తీవ్రతరమైంది. ఒకేసారి గుంపులు గుంపులుగా వచ్చి ఇళ్లలో, వ్యాపార సముదాయాలు, షాపులలో దాడి చేస్తున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మహిళలు, చిన్నపిల్లలపై దాడి చేసి వారి చేతిలో ఉన్న వస్తువులను ఎత్తుకెళ్తున్న ఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. మండల కేంద్రంలో పండ్లు, కూరగాయలు అమ్మేచోట వ్యాపారస్తులు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితులు నెలకొన్నాయి. మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంత గ్రామాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. పాఠశాలకు వెళ్లే చిన్నారులపై దాడి చేసి గాయపరిచిన ఘటనలు కూడా జరుగుతున్నాయి. మండలంలోని ఒక గ్రామంలో ఒక మహిళ బట్టలు ఆరబెట్టుటకు డాబా పైకి ఎక్కిన ఓ మహిళపై కోతులు దాడిచేయగా పరుగెత్తుకుంటూ కిందకు దిగేక్రమంలో మెట్లపై నుండి జారిపడి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉన్నది. రోడ్లపై పండ్లు, కూరగాయలు కొనుక్కుని నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులు ,చిన్నపిల్లలపై కోతులు దాడిచేసి గాయపరిచిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో కోతులు గుంపులుగా వ్యవసాయపంట పొలాల మీద ఎగబడి మొక్కజొన్న, కూరగాయలు వంటివాటిని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి ప్రజలను కోతుల బెడద నుంచి రక్షించి ప్రజలు ప్రాణాలకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.