ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 4 ప్రజాపాలన ప్రతినిధి. *కస్తూర్బా గాంధీ విద్యాలయం వసతి గృహాన్న

Published: Tuesday September 06, 2022
ఇబ్రహీంపట్నం  పరిధిలోని కస్తూర్బా గాంధీ వసతి గృహంలో విద్యార్థినులకు సరైన భోజనం, వసతులు కల్పించడం లేదంటూ గత నాలుగు రోజుల కింద విద్యార్థులంతా కలిసి రోడ్డుపై బైఠాయించి తమ బాధను వెళ్ళబుచ్చిన సంగతి అందరికీ విధితమే. మీడియాలో వస్తున్న వరుస కథనాలను చూసి స్పందించిన విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి సోమవారం ఇబ్రహీంపట్నం కస్తూరిబా గాంధీ వసతి గృహానికి చేరుకుని వసతి గృహ పరిసరాలను, అక్కడి వాతావరణం, మౌలిక వసతులను, విద్యార్థినులు  పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేతో కలిసి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వసతి గృహం లోపలికి ప్రజాప్రతినిధులను గాని పత్రికా, మీడియా వారిని గానీ అనుమతించలేదు. ఈ సందర్భంగా కస్తూర్బా గాంధీ వసతి గృహం నుండి బయటికి వచ్చిన అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు రెండు రోజులు నీరు రాక ఇబ్బంది పడ్డది వాస్తవమేనని వెంటనే బోర్ కు మోటార్ బిగించి నీళ్లు అందించారని ఇక్కడ కొంత డ్రైనేజీ సమస్య, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని ఈ సమస్యలన్నీ త్వరగా ఎమ్మెల్యే ద్వారా చెప్పి పరిష్కరిస్తామని వివరించారు. 8 ఏళ్లలో 1150 గురుకులాలను కళాశాలలుగా అప్డేట్ చేశామని ఇప్పుడున్న కస్తూర్బా గాంధీ వసతి గృహం చాలడం లేదని అందుకే పక్కన కొత్త వసతి గృహాన్ని నిర్మిస్తున్నామని అది పది రోజుల్లో పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. విద్యార్థుల పట్ల కొంత అలసత్వం జరిగిన మాట వాస్తవమేనని దీనికి బాధ్యులు స్పెషల్ ఆఫీసర్,ఒక  టీచర్ వారిపై చర్యలు తీసుకున్నామని అన్నారు. భోజనం విషయంలో నాణ్యమైన భోజనం అందించకపోతే వంట వారైనా, పనిచేసేవాళ్ళైనా సహించేది లేదన్నారు. విద్యార్థినులను నైట్ వాచ్ మెన్ కంటికి రెప్పలా కాపాడాలని, అలసత్వం వహిస్తే తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాజీ లేకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం ,సకల సదుపాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం సిద్ధార్థ కాలేజ్ యాజమాన్యం  నాగేయ్యగారు  కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు కొత్త బిల్డింగ్ అందుబాటులోకి వచ్చేవరకు అకామిడేషన్ ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్, మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి, వైస్ ఎంపీపీ ఆకుల యాదగిరి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చిలుకల బుగ్గ రాములు, మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల్ వెంకటరెడ్డి, కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.