గణేష్ ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై తేజావత్ కవిత

Published: Saturday August 27, 2022
బోనకల్, ఆగస్టు 26 ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని ప్రజలు వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై తేజావత్ కవిత మండల ప్రజలను కోరారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పందిళ్ళు, మండపాలు ఏర్పాటు కోసం పోలీస్ స్టేషన్ లో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఈనెల 31 న వినాయక చవితి పర్వదినం సందర్భంగా మండల పరిధిలో అన్ని గ్రామాల ప్రజలు గణేష్ విగ్రహాల ఏర్పాటు చేసేవారు కమిటీ సభ్యులుగా ఏర్పడి స్థానిక పోలీస్ స్టేషన్ లో అనుమతులు పొందాలని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విగ్రహా ఏర్పాటు దారులు, అధికారులు నిర్దేశించిన నిబంధనల మేరకు నడుచుకొని వినాయక చవితి పండుగను జరుపుకోవాలని ఆమె సూచించారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే మండపాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విగ్రహ ప్రతిష్ట నాటినుండి ఎన్ని రోజుల పాటు పూజలు జరుపుతున్నారో, నిమజ్జన కార్యక్రమం ఎప్పుడు. ఎక్కడ నిర్వహిస్తారో వాటికి సంబంధించిన అన్ని అంశాలు పోలీసు వారికి తెలపాలన్నారు.
మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల ప్రజలు పోలీస్ వారికి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విగ్రహాలు ఏర్పాటు చేస్తే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.