లైంగిక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Published: Tuesday December 20, 2022
 జిల్లా యువజన, క్రీడల అధికారి హనుమంతరావు
వికారాబాద్ బ్యూరో 19 డిసెంబర్ ప్రజా పాలన : ఎయిడ్స్ బారిన పడకుండా యువత లైంగికంగా సంక్రమించే వ్యాధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి హనుమంతరావు  తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి కార్యాలయంలో ఎయిడ్స్, క్షయ, కుష్ఠ వ్యాధిపై తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, నెహ్రూ యువ కేంద్ర  ఆధ్వర్యంలో యువతి యువకులకు  అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ అనంతరం జిల్లాలో ఎయిడ్స్ వేగవంతంగా వ్యాప్తి చెందుతుందని, యువత దీనిపట్ల పూర్తి అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు.  ఎయిడ్స్ వ్యాధి అరక్షిత లైంగిక సంపర్కం వల్ల ఒకరి నుండి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుందని తెలిపారు.  ముందు జాగ్రత్తలు పాటిస్తూ మహమ్మారి  బారిన పడకుండా సురక్షితంగా యువత ఉండాలన్నారు. దీనికి మందు లేదని నివారణ ఒక్కటే మార్గమని తెలియజేశారు.  ఎయిడ్స్ పట్ల జిల్లాలోని అన్ని కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  అవగాహన కలిగిన యువకులు తమ తోటి మిత్రులకు ఇరుగుపొరుగు వారికి, గ్రామస్థాయిలో ఉండే యువతకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉప 
వైద్యాధికారి క్షయ, కుష్ట, ఎయిడ్స్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. రవీందర్ మాట్లాడుతూ, ఎయిడ్స్ తో పాటు క్షయ, కుష్ట వ్యాధుల పట్ల కూడా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు.  రెండు వారాలకు మించి దగ్గు ఉన్నట్లయితే క్షయ వ్యాధికి సంబంధించిన టెస్టులు చేయించుకుని వ్యాధిని నిర్ధారించుకోవాలన్నారు.  దగ్గుతో పాటు తేమడ, రక్తం పడటం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తెమడ పరీక్ష ఎక్సరేల ద్వారా వ్యాధి నిర్ధారించుకొని 6 నెలల పాటు చికిత్స పొందినట్లయితే వ్యాధి పూర్తిగా నయం అవుతుందన్నారు. నిర్లక్ష్యం వహిస్తే ఇట్టి వ్యాధి ఇతరులకు సోకే ప్రమాదం ఉందని తెలియజేశారు. జిల్లాలో ప్రస్తుతం1200 మంది క్షయ వ్యాధిగ్రస్తులను  గుర్తించి వారికి మెరుగైన చికిత్సలు అందజేయడం జరుగుతుందన్నారు.  క్షయ వ్యాధి మాదిరిగానే కుష్ఠ వ్యాధి కూడా గతంలో చాలా తీవ్రంగా ఉండేదని, ప్రస్తుతం ఈ వ్యాధిని అదుపు చేయడం జరిగిందన్నారు.  ఈ వ్యాధి కూడా ఒకరి నుండి ఇంకొకరికి సోకుతుందని, స్పర్శ లేని మచ్చలు ఏమైనా ఉన్నట్లయితే, వెంటనే డాక్టర్ ను సంప్రదించి  ఆరు నెలల నుండి సంవత్సరం పాటు చికిత్స పొందినట్లయితే ఈ వ్యాధి పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటికీ 90 కేసులకు చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు. ఎయిడ్స్, క్షయ, కుష్ఠ  వ్యాధులు ఉన్నవారు సిగ్గుపడకుండా స్థానిక ప్రభుత్వ వైద్యాధికాలను సంప్రదించి మెరుగైన చికిత్సలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యూత్ ఆఫీసర్ ఈసయ్య, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ రిసోర్స్ పర్సన్ నరసింహ స్వామి, ఎస్ఏపీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్, తక్షశిల కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శివకుమార్, ఐ సి టి సి కంట్రోలర్ రత్నాకర్, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి దీపారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ లేబర్ శాఖ శ్రీనివాసరావు  తదితరులు పాల్గొన్నారు.