ఎల్లకొండలో బోనమెత్తిన జోగిని శ్యామల * ఎల్లకొండ సర్పంచ్ రావుగారి వెంకటరెడ్డి

Published: Tuesday December 20, 2022

వికారాబాద్ బ్యూరో 19 డిసెంబర్ ప్రజా పాలన : ఊరడమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా సోమవారం జోగిని శ్యామలాదేవి బోనం ఎత్తిందని ఎల్లకొండ గ్రామ సర్పంచ్ రావు గారి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం నవాబుపేట మండల పరిధిలోని ఎల్లకొండ గ్రామంలో గత నాలుగు రోజుల నుండి ఊరడమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా సర్పంచ్ రావు గారి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరముల క్రితం గ్రామ ఆనవాయితీగా నిర్వహిస్తున్న గ్రామ దేవత ఊరడమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని వివరించారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించేందుకు గ్రామ దేవత రక్షణ కవచంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామానికి ఏ చీడపీడలు రాకుండా పాడి పంటలతో సిరి సంపదలతో ప్రతి ఇంట విరాజిల్లుతుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం అన్నారు. గ్రామంలో జరిగే ఉరడమ్మ ఉత్సవాలను చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి తరిస్తున్నారని వివరించారు. సోమవారం రాత్రి జరిగిన బోనాల ఉత్సవంలో జోగిని శ్యామలాదేవి నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుందని స్పష్టం చేశారు. ప్రత్యేక వాయిద్యాలకు అనుగుణంగా బోనమెత్తిన జోగిని శ్యామలాదేవి నృత్యం కన్నుల కెంపుగా చూపర్లను కట్టిపడేసిందని విశ్లేషించారు. భక్తులు గ్రామదేవతను భక్తి ప్రపత్తులతో కొలిచి మొక్కులు చెల్లించుకున్నారని చెప్పారు. జాతర ఉత్సవానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇతర రాజకీయ ప్రతినిధులు గ్రామ పెద్దలు పిన్నలు మహిళలు పాల్గొన్నారు.