కబ్జాలో ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రమబద్దీకరించుకోండి

Published: Wednesday April 19, 2023
     కబ్జాలో ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించేందుకు అర్హులైన లబ్ధిదారులు ఈనెల 30 వరకు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి తెలియజేశారు.
* జీవో నెంబర్ 58 59 ప్రకారం క్రమబద్ధీకరణ
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 18 ఏప్రిల్ ప్రజా పాలన :  ప్రభుత్వ స్థలాలలో ఉన్న లబ్ధిదారులు జీవో నెంబర్ 58, 59 ప్రకారం క్రమబద్ధీకరణ చేయించుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం టెలికాన్ఫిరెన్స్ ద్వారా సంబంధిత ఆర్డీవోలు, తహసిల్దారులు, సెక్షన్ సూపరింటెండెంట్ లతో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి జి ఓ నెంబర్ 58, 59 ప్రకారంగా ప్రభుత్వ భూములలో కబ్జాలో ఉన్న వారందరికీ చివరిసారిగా అవకాశం కల్పిస్తున్నట్లు తెలియజేశారు. దారిద్ర రేఖకు దిగువన ఉండి 125 చదరపు గజముల లోపు ఆక్రమణంలో ఉన్నవారికి ఈనెల 30 వరకు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే  ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా క్రమబద్ధీకరణ చేయడం జరుగుతుందన్నారు.  జీవో నెంబర్  59 ప్రకారంగా 125 చదరపు గజాల కంటే ఎక్కువ స్థలం ఆక్రమించుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకుంటే తగిన రసం చెల్లించిన వారికి కూడా క్రమబద్ధీకరణ చేయడం జరుగుతుందన్నారు. 2014 నుండి జూన్ 2, 2020 వరకు కల పరిమితిని పెంచుతూ  2020 నాటికి కబ్జాలో ఉన్న వారందరూ కూడా అర్హులని తెలిపారు.  లబ్ధిదారులందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా తహసీల్దారులు, మున్సిపల్ కమిషనర్లు తమ మండలాలు, మున్సిపల్ వార్డులలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించి అర్హులందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని అన్నారు. ధరణి కార్యక్రమంలో భాగంగా అన్ని మండలాలలో డిసెంబర్ 31, 2022 వరకు వచ్చిన జి ఎల్ ఎం, సక్సెషన్, పెండింగ్ మ్యుటేషన్ పనులన్నింటినీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలన్నారు.  డబుల్ బెడ్ రూమ్ కు సంబంధించిన వెరిఫికేషన్ పనులు పూర్తి చేసి సాఫ్ట్ కాపీలను శనివారం వరకు అందజేయాలని ఆదేశించారు.  రంజాన్ పండుగ సందర్భంగా గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాలు రెండు రోజులలో పూర్తి చేయాలని అన్నారు.