రైతులకు వ్యవసాయ, ఉద్యానవన శాఖలు గుండె వంటివి ** జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు **

Published: Wednesday February 15, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 14 (ప్రజాపాలన, ప్రతినిధి) :రైతుల అభివృద్ధి, సంక్షేమంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖలు గుండె వంటివని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు, ఉద్యానవన శాఖ ద్వారా నిర్వహిస్తున్న ఆయిల్ ఫామ్ విస్తరణ పనులపై వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులతో సమీక్ష  నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమ అభివృద్ధిలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ కీలకపాత్ర పోషిస్తాయని, ఈ క్రమంలో రైతు వేదికలో వారానికి ఒకసారి రెండు శాఖల అధికారులు సమావేశం ఏర్పాటు చేసుకొని సమావేశపు అంశాలను వాట్సాప్ గ్రూపు ద్వారా పంపించాలని తెలిపారు. కార్యాలయ పనివేళల్లో ఉదయం 10 గంటల నుండి 5.30 గం వరకు క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేసి 100 శాతం క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించి రైతులకు చేరువగా పనిచేయాలని సూచించారు. జిల్లాలోని మండలాలలో సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ పంట సాగు నివేదిక అందించాలని, సాగు చేయని మండలాల వివరాలు సైతం పొందుపరచాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏ.డి.శ్రీనివాస్ రావు, ఉద్యానవన శాఖ ఏ.డి. వెంకటేష్,వ్యవసాయ విస్తరణ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.