ప్రతి ప్రాథమిక విద్యార్థి ఎల్ఎస్ఆర్ డబ్ల్యు లో రాణించాలి

Published: Saturday October 29, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 28 అక్టోబర్ ప్రజా పాలన : ప్రాథమిక పాఠశాలలో చదువుకునే ప్రతి విద్యార్థి ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ ( లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ ) చతుర్థాంశాలలో రాణించే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. శుక్రవారం దోమ మండలం శివారెడ్డి పల్లి గ్రామంలో (ఎఫ్ఎల్ఎన్) తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు రెగ్యులర్ గా చెబుతున్న పాఠాలతో పాటు చదువులో వెనుకబడి ఉన్న   ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధించి విద్యా ప్రమాణాలను పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేటట్లు చూడాలన్నారు.  విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా తమ విధులకు సక్రమంగా హాజరు కావాలని అన్నారు.  ఉపాధ్యాయులు ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా తమ స్వంత పిల్లలవలే చూసుకొని మంచి విద్యను అందించి వారి భవిష్యత్తును మెరుగుపరచాలని సూచించారు. ఇదే పాఠశాలకు తిరిగి వస్తానని అన్నారు. విద్యార్జనలో వెనుకబడి ఉన్న విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని స్పష్టం చేశారు. లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ ఉపాధ్యాయులను హెచ్చరించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో ఆంగ్లంలో చదవడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలను కూడికలు తీసివేతలు గుణకారం భాగహారం చేయించడం జరిగింది.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మన బడి పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్వహించి వారంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలు గుడితో సమానమని మన ఊరు మన బడి కింద అన్ని పనులు చేపట్టి అందంగా తీర్చి దిద్దాలన్నారు. రోజు వారిగా చేపట్టే పనుల ఫోటోలను తన వాట్సాప్ కు పంపించాలన్నారు.  ఫస్ట్ నవంబర్  నుండి పాఠశాలకు కలరింగ్ పనులు చేపట్టి పూర్తి చేయాలని సూచించారు.  చేపట్టిన పనులకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణ స్థలాన్ని పరిశీలించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కలను కూడా ఈ సందర్భంగా పరిశీలించడం జరిగింది.  ఈసారి నిర్వహించే హరితహారం కు అవసరమైన మొక్కలను సిద్ధం చేయాలని ఆదేశించారు. మొక్కలకు ప్రతి రోజు  నీరు పోసి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ కృష్ణన్, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా దేవి, మండల విద్యాశాఖ అధికారి హరీష్ చంద్ర, ఇరిగేషన్ డి ఈ పార్థసారథి, ఏ ఇ సిద్ధార్థ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరసింహులు, సర్పంచ్ నరేందర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.