స్వీయానుభవంతో బోధన మెలకువలు వృద్ధి * ప్రధానోపాధ్యాయులుగా సహస్రభవ్ రెడ్డి

Published: Tuesday September 06, 2022

వికారాబాద్ బ్యూరో 05 సెప్టెంబర్ ప్రజా పాలన : స్వయం పరిపాలన దినోత్సవంలో బోధన మెలకువలతో పాటు నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందుతాయని ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టిన కెరెల్లి సహస్రభవ్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య ఉన్నత పాఠశాల వికారాబాద్ లో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టిన కెరెల్లి సహస్రభవ్ రెడ్డి మాట్లాడుతూ అనునిత్యం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను సమన్వయంతో సామరస్యంతో ఎలా పరిష్కరించగలుగుతున్నారోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాలాంశాలవారీగా బోధనా అంశాలను ప్రణాళిక బద్ధంగా తయారు చేసుకొని తరగతి గదుల్లో విద్యార్థులకు వివరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తరగతి గదిని క్రమశిక్షణలో ఉంచుతూ విద్యార్థుల దృష్టిని పాఠంపై నిలిపే విధంగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని విద్యార్థులు శ్రద్ధగా వినేటట్లు ఆసక్తిని కలిగించే విధంగా చలోక్తులు చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తించాను. చెప్పే పాఠంలో ఏవైనా అనుమానాలు ఉన్నచో వాటిని నోట్ బుక్ లో నోట్ చేసుకునే విధంగా సూచించాను. పాఠం చెప్పిన తర్వాత విద్యార్థులు నోట్ చేసుకున్న అనుమానాలను నివృత్తి చేశాను. స్వయం పరిపాలన దినోత్సవంలో స్వీయానుభావం పొందగలిగాను. పాఠశాల అంటేనే సమయపాలన క్రమశిక్షణకు మారుపేరని గ్రహించాను. పాఠ్యాంశంపై ఏకాగ్రత సహ ఉపాధ్యాయులకు పనులు అప్పజెప్పుట సక్రమంగా పనులు నిర్వహించే టట్లు పురిగొలపడం కార్యాలయంలోని రిజిస్టర్ లను సక్రమంగా నిర్వహించడం విద్యార్థుల తల్లిదండ్రులను చిరునవ్వుతో పలకరించి ఉభయ కుశలోపరి ప్రశ్నలను సంధించాను. మధ్యాహ్న భోజనం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు సూచనలు సలహాలు ఇచ్చానని స్పష్టం చేశారు. నేను ప్రధాన ఉపాధ్యాయునిగా బాధ్యతలు చేపట్టుటకు నా తల్లిదండ్రులు కేరెల్లి నవనీత కెరెల్లి మాణిక్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రేరణ కలిగించారని సంతోషం వ్యక్తం చేశారు.