భూసేకరణ బాధితులకు ప్రత్యేక చర్యలు ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **

Published: Thursday December 29, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 28 (ప్రజాపాలన,ప్రతినిధి) : 
జిల్లాలోని జాతీయ రహదారులు, కాలువలు, ప్రాజెక్టుల నిర్మాణ ప్రక్రియలో భూములు,ఇండ్లు కోల్పోయిన బాధితులకు పరిహారం అందించే దిశగా పనులు వేగవంతం చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి రెవెన్యూ, ఇరిగేషన్, ఇంజనీరింగ్, భూ కొలతల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులలో జాతీయ రహదారులు, ప్రాజెక్టులు, కాలువల నిర్మాణంలో భూములు, ఇండ్లు కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లింపు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భూ సేకరణ పై కోర్టులలో కొనసాగుతున్న కేసులకు సంబంధించిన కౌంటర్లను వెంటనే సమర్పించాలని,ప్రాజెక్టులలో బాధితులకు పరిహారం చెల్లింపులు చర్యలు తీసుకుంటున్నామని,గతంలో భూసేకరణ కింద తీసుకున్న భూములలో ఎలాంటి నిర్మాణం జరుగనట్లయితే సర్వే చేసి అవార్డులను రద్దుచేసి తిరిగి పట్టాదారులకు భూములు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలోని మొఘడ్ ధఘడ్, జైహింద్ పూర్ మైనర్ చెరువులకు సంబంధించి 2013 జీవో ప్రకారం సర్వే జరిపి పరిహారం చెల్లింపుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కొమురం భీమ్ ప్రాజెక్టు కాలువల నిర్మాణంలో జాతీయ రహదారి నిర్మాణంలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు వెంటనే పరిహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని, అన్ని అవార్డుల ప్రక్రియ పూర్తి చేసే దిశగా అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఓఎస్డి మనోహర్, రాజస్వ మండల అధికారి రాజేశ్వర్, నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీరింగ్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.