రైతు మహాసభలకు తరలిన రైతులు

Published: Saturday July 02, 2022
బోనకల్ ,జూలై 1 ప్రజా పాలన ప్రతినిధి: ఈనెల 1, 2, 3 తేదీలలో హుజూర్నగర్ లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభలకు బోనకల్ మండలంలోని పలు గ్రామాల నుండి రైతులు తరలి వెళ్లారు. రైతులు వెళుతున్న వాహనాలను తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి జక్కుల రామారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం రైతాంగం సంక్షోభంలో ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను గాలికి వదిలేసాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రచార హార్భాటాలకే తప్ప రైతులకు ఏమాత్రం పనికి రాలేదన్నారు. ఈ బీమా పేరు చెప్పి వేలకోట్ల రూపాయలను రైతుల దగ్గర నుంచి ప్రీమియం కార్పొరేట్ సంస్థలకు మోడీ దోచి పెట్టారని ఆయన దిగబట్టారు. రైతుల రుణమాఫీ చేస్తానని 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేసీఆర్ వాటిని తుంగలో తొక్కారన్నారు. కేవలం రైతుబంధు ఇస్తే రైతుల సమస్యలు తీరుతాయంటూ కెసిఆర్ ప్రగల్పాలు పలుకుతున్నారని, అంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చిన ఇంప్లిమెంట్స్ సబ్సిడీ గురించి ఎందుకు మాట్లాడట్లేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. మండలం లో సుమారు నాలుగు కోట్ల రూపాయల రైతుల ప్రీమియం బడా కార్పొరేట్ శక్తుల ఖాతాల్లోకి వెళ్లాయని, త్వరలో వాటిని మరలా రైతులకు ఇప్పించేందుకు ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, రైతులు పూచ్చాకాయాల తిరుపయ్య,కురిచేటి మురళి, చింతల చెరువు రామరావు, పూచ్చకాయల బ్రహ్మం, షేక్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.