జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసిన నిందితులు అరెస్ట్

Published: Monday April 26, 2021

మంచిర్యల, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి రూ. 1,97,46,151 లను కొల్లగొట్టాలని ప్రయత్నం చేసిన రాంనగర్ మంచిర్యాలకు చెందిన తాళ్లపల్లి రాజు, మేడిపల్లి జీవన్, ఏ-జోన్ రామకృష్ణాపూర్, మంచిర్యాలకు చెందిన  తాళ్లపల్లి శ్రీనివాస్ ఆదివారం అరెస్టు చేశారు. ఈ మేరకు మంచిర్యల ఎసిపి అఖిల్ మహాజన్  నేరముకు సంబంధించిన వివరాలు మీడియాకు వివరించారు. వివరాల్లోకి వెళ్తే. ఎసిపి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తాళ్లపల్లి రాజు గతంలో  టిఎస్ యండి సి యందు లారీలకు స్లాట్ బుక్ చేస్తుండేవాడు. ఈ క్రమంలో లో అతను తరచుగా అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ ఆఫీస్ కి వెళ్లేవాడు. అలాగే అతని అన్న తాళ్లపల్లి శ్రీనివాస్ కూడా ఏడి మైనింగ్ ఆఫీస్ లోనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేసేవాడు. గత కొన్ని నెలలుగా జిల్లాలో సాండ్ టాక్సీ నడుస్తుండడం దానిలో కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు జమ అవుతుండడం వీరు గమనించారు. అలాగే దీని చెక్కలు తయారీ చేయడం, బ్యాంక్ ఎకౌంట్ మెయింటెన్ చేయడం, డబ్బులు విత్ డ్రా చేసే పొసెస్ ను రాయాలిటీ ఇంన్స్ పెక్టర్  లతో పాటు అప్పుడప్పుడు నిందితుని అన్న అయిన తాళ్లపల్లి శ్రీనివాస్ చూసుకునేవాడు. ఫిబ్రవరి రెండో వారంలో చెన్నూరు ఏరియా కు సంబంధించిన ఒక సాండ్ మైనింగ్ పర్మిషన్ గురించి వివరాలు తెలుసుకొనుటకు నిందితుడు రాజు ఏడి మైనింగ్ ని కలిసిన సందర్భంలో అతనితో గొడవ పడడం జరిగినది. అదేవిధంగా మైనింగ్ ఎడి ఆఫీస్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న అతని అన్న తాళ్లపల్లి శ్రీను సాండ్ టాక్సీ ట్రాక్టర్ ల విషయంలో అక్రమాలకు పాల్పడుతుండటంతో అతనిని ఉద్యోగం నుండి తొలగించడం కోసం మైనింగ్  ఏ.డి. ప్రయత్నం చేసినారు. ఈ క్రమంలో లో అన్న దమ్ములు ఇద్దరు ఏరోజైనా తాము ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి దూరంగా జరగాల్సి ఉందని భావించి, శాండ్ టాక్సీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమ అవుతున్న కోట్ల రూపాయలను కొల్లగొట్టాలని అందువల్ల తాము లాభపడటం తోపాటు, ఏ.డి. మైనింగ్ కు చెడ్డపేరు వచ్చి అతని ని బదిలీ చేస్తారని భావించి అందుకోసం ఆఫీసు చెక్ బుక్ ను దొంగిలించి దానిద్వారా, ఆ చెక్కులను బ్యాంకులో డిపాజిట్ చేసి డబ్బులు స్వాహా చేయాలని పథకం వేశారు. ఈ క్రమంలో లో ఫిబ్రవరి నెల చివరి వారంలో ఏ.డి. మైనింగ్ ఆఫీస్ వారు ఐసిఐసిఐ బ్యాంకు ద్వారా కొత్త చెక్ బుక్ ల కోసం రిక్వెస్ట్ పెట్టిన విషయం తన అన్న ద్వారా తెలుసుకొని అవి డెలివరీ కొరియర్ లో వస్తాయన్న సమాచారం మేరకు నిందితుడు మార్చి మొదటి వారంలో తరచుగా  కొరియర్ ఆఫీస్ కు వెళ్ళినాడు. అతను అమెజాన్ యందు రిటైల్ సెల్లర్ గా పనిచేస్తుండటంతో సరకులు డెలివరీ చేయడం కోసం తరచుగా ఆ కొరియర్ ఆఫీస్ కి వెళ్తుండటం తో అక్కడ ఉద్యోగస్తుల తో అతనికి చనువు ఏర్పడినది. దీనితో 9 మార్చి 2021 రోజు డెలివరీ ఆఫీస్ వెళ్ళినప్పుడు సాండ్ మనజేమెంట్ కి సంబందించిన బ్యాంక్ చెక్ బుక్  పార్సెల్ కనబడగా, నిందితుడు తాను అదే ఆఫీస్ కి వెళ్తున్నానని అని, ఆ పార్సల్ ని డెలివరీ చేసి, మీకు ఓటిపి చెప్తానని చెప్పి ఆ పార్సల్ తీసుకొని నేరుగా తన ఇంటికి వెళ్లి తన మిత్రుడు జీవన్ తో కలిసి  ఆ పార్సల్  ఓపెన్ చేసి దానిలో ఉన్న 5 చెక్ బుక్ లలో ఒక చెక్ బుక్ తీసి, మిగతా నాలుగు చెక్ బుక్ లను అందులోనే ఉంచి మరలా పార్సల్ చేసి ఎ.డి. మైనింగ్ ఆఫీస్ లో అప్పగించాడు. ఎ.డి. మైనింగ్ ఆఫీస్ యందు ఉద్యోగి తన పని వత్తిడిలో ఈ పార్సెల్ ఓపెన్ చేసినది గాని అలాగే అందులో నుండి ఒక చెక్ బుక్ ను దొంగతనం చేసింది గాని గమనించలేదు. నిందితుడు మిగతా ఇద్దరితో కలిసి తాము దొరకకుండా ఉండేందుకు అన్ని రకాలుగా ఆలోచించి మొదట మహారాష్ట్రలోని చంద్రాపూర్ యందు అకౌంట్ ఓపెన్ చేయడానికి నిర్ణయించుకుని, అక్కడ ఉన్న తన మిత్రుని ద్వారా తనకు అమెజాన్ ద్వారా వస్తున్న మొత్తానికి పెద్ద మొత్తంలో ఆదాయపన్ను పడుతుందని అందుకని ఇంకొక అకౌంట్ ఉంటే మంచిదని ఎవరైనా ఉంటే వారి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసుకుంటానని అందుకుగాను మొత్తం ఖర్చు తానే భరిస్తానని, 50 వేల రూపాయలు ఇస్తానని చెప్పగ, అతని మిత్రుడు పది రోజుల సమయం తీసుకొని లలితా పాయల్ బంకర్ అనే ఆమెను ఒప్పించాడు. ఇదే సమయంలో లో అకౌంట్ కోసం లింకు ఫోన్ నెంబర్ అవసరం ఉంటుంది కాబట్టి నిందితుడు జగిత్యాల లో ఉన్న ఒక మిత్రుని ద్వారా చిత్తూరు కు సంబంధించిన ఒక వ్యక్తి యొక్క ఆధార్ కార్డుతో ఒక సిమ్ నెంబర్ తీసుకున్నాడు. ఈ ఫోన్ నెంబర్ ను ఇచ్చి చంద్రపూర్ యందు యాక్సిస్ బ్యాంకులో లలితా పాయల్ బంకర్ పేరుమీద ఒక ఎకౌంటు ఓపెన్ చేసి దానికి చెక్ బుక్ తీసుకుని ఆ చెక్ బుక్ పై ఆమె సంతకాలు తీసుకుని మంచిర్యాలకు వచ్చినాడు. అనంతరం నిందితుడు  జిల్లా కలెక్టర్ మరియు ఎడి మైనింగ్ యొక్క స్టాంపులు తయారు చేయించారు. అలాగే జిల్లా కలెక్టర్, ఏ.డి. మైనింగ్ యొక్క సంతకాలను తన అన్న ద్వారా సేకరించి, జీవన్ ద్వారా వాటిని ప్రాక్టీస్ చేయించాడు. అన్ని రకాలుగా తాము ఏ రకంగా పట్టుబడే అవకాశం లేదని నిర్ధారణ చేసుకొని జిల్లా కలెక్టర్ మరియు ఏ.డి. సంతకాలను జీవన్ ఫోర్జరీ చేసి 1,97,46,151 రూపాయలకు లలితా పాయల్ బంకర్ పేరుమీద ఒక చెక్కు తయారు చేసి దానిని తన అన్నద్వారా 16.04.2021 రోజు ట్రాక్టర్ ఔనెర్స్ పేమెంట్ ద్వారా సుమారు 3.5 కోట్ల రూపాయలను కలెక్టర్ అప్రూవ్ చేసి చెక్ ఇష్యూ చేస్తున్నారని దానిని 17.04.2021 రోజు ఏ.డి. బ్యాంకర్స్ ప్రసెంట్ చేస్తున్నారని అదే సమయం లో మనం చెక్ వేస్తే ఎటువంటి ఎంక్వయిరీ లేకుండా దానితో పాటు మనం వేసే చెక్ కూడా అప్రూవ్ అవుతుందని చెప్పగా తన అన్న సలహా మేరకు తేదీ 17.04.2021 రోజు కరీంనగర్ యాక్సిస్ బ్యాంక్ యందు జీవన్ డిపాజిట్ చేయడం జరిగింది. అయితే అది పెద్ద మొత్తం కావడం తో ఆక్సిస్ బ్యాంకు వారు నిందితునికి ఫోన్ చేసి  అతన్ని వ్యక్తిగతంగా కరీంనగర్ బ్రాంచ్ కి రమ్మని కోరడం జరిగింది అలాగే వారు ఎ.డి. మైనింగ్ ఎకౌంటు, వున్న ఐసిఐసి బ్యాంక్ మంచిర్యాల కు కన్ఫర్మేషన్ కోసం అడగడం జరిగింది. సాధారణంగా ఏ.డి. మైనింగ్ గారు చెక్కులను సంస్థల పేరుమీదుగాని లేదంటే గ్రామ పంచాయతీలకు కానీ ఇస్తుంటారు. అయితే ఈ చెక్ పెద్ద మొత్తంలో ఉండడం వ్యక్తిగతంగా ఇవ్వడంతో వారికి అనుమానం వచ్చి మైనింగ్ ఆఫీస్ వారిని ఎంక్వయిరీ చేయడంతో వారు  ఆ నెంబర్ తో తాము ఎటువంటి చెక్ ఇవ్వలేదని చెప్పి, బ్యాంకు నుండి సమాచారం తీసుకొని జరిగిన మోసం పైన మంచిర్యాల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా, దాని పైన కేసు నమోదు చేసి పూర్తిగా శాస్త్రీయ పద్ధతులలో విచారణ చేసి నిందితులను గుర్తించి ఈరోజు ఉదయం వారిని అరెస్టు చేయడం జరిగినదని ఎసిపి తెలిపారు. సీజ్ చేసిన ప్రాపర్టీ వివరములు నిందితుల వద్ద నుండి వారు దొంగిలించిన ఎ.డి. మైనింగ్ ఆఫీస్ కు సంబంధించిన ఐసిఐసిఐ బ్యాంక్ చెక్ బుక్, ఆ డబ్బులు డ్రా చేసుకోవడానికి వారు చంద్రాపూర్ యాక్సిస్ బ్యాంకు నందు ఓపెన్ చేసిన అకౌంట్ బుక్ మరియు చెక్ బుక్, స్టాంపు ప్యాడ్, జిల్లా కలెక్టర్ మరియు ఏ. డి. గారి సంతకాల కాపీలు, పెన్నులు, పథకం రూపొందించటానికి వాడిన  వారి ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన వివరించారు.