రిజర్వాయర్ భూ నిర్వాసితుల భిక్షాటన వేలాది ఎకరాలు ఇచ్చిన తమను వేధిస్తున్నారు ఇంటికో ఉద్యో

Published: Tuesday April 04, 2023
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
 
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కర్వేనా రిజర్వాయర్ నిర్మాణం కోసం తమ భూములు ఇచ్చి ప్రస్తుతం అన్నీ కోల్పోయిన తాము భిక్ష యాటన చేసి జీవించే దుస్థితి తీసుకువచ్చారని భూములు కోల్పోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బాధిత రైతులు బాలకృష్ణ, ఏం నిరంజన్, శ్రీను, రామచంద్రయ్య, నేలమ్మ, హనుమంతమ్మ, సీతారాం, నర్సింగ్  మాట్లాడారు. సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలంటూ బిక్ష యాటన చేశారు. 2015 వ సంవత్సరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములు సేకరించేందుకు సిద్ధపడగా ఉమ్మడి రాష్ట్రంలో నీటి కోసం కటకటలాడిన ప్రాంతం లో జలసిరులు నిండుతాయని తామంతా భూములను ఇచ్చామని తెలిపారు. బూత్కూరు, జడ్చర్ల మండలాలకు చెందిన ఎనిమిది గ్రామాల లో సుమారు రెండు వేల పైచిలుకు జనాభా 35వేల ఎకరాలను ప్రాజెక్టు కోసం కోల్పోవాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. వ్యవసాయమే జీవన ఆధారంగా చేసుకుని జీవిస్తున్న తమకు ప్రస్తుతం ఉన్న ధరకు నాలుగింతలు చెల్లించడంతోపాటు కుటుంబానికి ఉద్యోగము పునరావసం కల్పిస్తామని నమ్మ బలిసిన ప్రభుత్వ అధికారులు తీవ్రంగా మోసం చేశారని అన్నారు. పూర్తి నష్టపరిహారము ప్రభుత్వ ఉద్యోగం పునరావసం పూర్తి అయిన అనంతరమే భూములను సేకరిస్తామని చెప్పిన ప్రభుత్వం అవేవీ చేయకుండానే బలవంతంగా తమ భూములను తెలిపారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూములు సేకరించాల్సి ఉండగా ఎలాంటి నిబంధనలు పాటించకుండా రెండు వేల కుటుంబాలకు కంటి తుడుపు నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కు విన్నవించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. ఉన్న ఊరిలో భూములు కోల్పోయి ఉపాధి లేక కుటుంబాన్ని పోషించలేని దుస్థితిలో ఉన్న తమపై పోలీసులు స్థానిక అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. దేశానికి ఆదర్శంగా ప్రాజెక్టులు నిర్మించామని చెబుతున్న ముఖ్యమంత్రి ఆ ప్రాజెక్టుల కోసం భూముల కోల్పోయిన వారిని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. భూములను కోల్పోయిన నాటి నుంచి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారులు నాయకులు చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. దిక్కుతోచని తాము తమ గోడును గవర్నర్ తమిళసై కి విన్నవించుకునేందుకు నగరానికి వచ్చామని ఆమె లేకపోవడంతో గవర్నర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించినట్లు చెప్పారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చిన నిర్వాసితులు భిక్షాటన చేసి తమ గోడును ప్రభుత్వానికి విన్నవించాలంటూ మీడియాను వేడుకున్నారు.