దళిత వాడలో పల్లె నిద్ర

Published: Wednesday July 07, 2021
- పాదయాత్ర చేసిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జూలై 06 ప్రజాపాలన బ్యూరో : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టానని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో గల మర్పల్లి మండలానికి చెందిన దార్గులపల్లి  గ్రామంలో సోమవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం తుమ్మలపల్లి గ్రామంలో పల్లె ప్రగతి  కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. సోమవారం రాత్రి దార్గులపల్లి గ్రామంలో దళిత వాడలోని తలారి బాల్ రాజ్ ఇంట్లో బస చేసి ఉదయం గ్రామంలోని వీధుల్లో పర్యటించి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో సమస్యలు పరిష్కరిస్తూ, అన్ని గ్రామాలలో సమానంగా అభివృద్ధి చేసేందుకు పల్లె నిద్ర కార్యక్రమం అన్నారు. గ్రామస్థులతో కూర్చోని గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పగటి సమయంలో కూడ మా గ్రామంలోకి ఏ ఎమ్మెల్యే రాని పరిస్థితిలో రాత్రి సమయం మాతో గడిపేందుకు వచ్చిన ఎమ్మెల్యేను చూసి గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీలో విద్యుత్తు సరఫరా కోసం నూతనంగా కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో ఉన్న ఇంకుడు గుంతల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలో శానిటేషన్ పనులు ఇంకా మెరుగ్గా జరగాలన్నారు. పోచమ్మ గుడి ముందు ఉన్న గుంతను పూడ్చేసే విధంగా సిబ్బంది ప్రణాళిక రూపొందించాలన్నారు. ఎస్సీ కాలనీలో ఉన్న నీటి బావి పైన జాలి ఏర్పాటు చేయాలన్నారు. అదనపు మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు త్వరగా ఏర్పాటు చేయాలని మరియు నాళాలు బిగించాలని ఆదేశించారు. క్రిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు సరిచేయాలన్నారు, వర్షాకాలంలో విద్యుత్ సరఫరా కోసం అంతరాయం కలగకుండా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
తుమ్మలపల్లి గ్రామంలో పర్యటన : తుమ్మలపల్లిలో దళిత వాడలో ప్రతి వీధిలో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు.  బహిరంగ మల మూత్ర విసర్జన చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. పాటించని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ నీటి ట్యాంక్ లను తప్పని సరిగా శుభ్రం చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామస్థులందరూ కలిసి గ్రామ అభివృద్ధి కోసం పాటు పడాలన్నారు. గ్రామ సభలో ప్రజలందరూ పాల్గొని సమస్యలను గ్రామ సర్పంచ్ కు తెలియజేయాలన్నారు. గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉన్న నిధులకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అనంతరం నాల్గవ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, హరితహారం నర్సరీని సందర్శించారు. ఏడవ హరితహారంలో కార్యక్రమంలో భాగంగా పల్లె ప్రకృతి ఆవరణంలో మొక్కలు నాటి, నీరు పోయడం జరిగింది. బాబు జగ్జీవన్ రామ్ సేవలుచిరస్మరణీయం ఈరోజు భారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్పల్లి మండలం పట్లూర్ గ్రామంలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు విజయ్ కుమార్,  హంసమ్మ, ఎంపీపీ లలిత రమేష్, జెడ్పీటీసీ మధుకర్, ఎంపీటీసీ లు యేసమ్మ, మల్లేశం, మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, రైతు బంధు అధ్యక్షులు నాయబ్ గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.