గ్రీనరీ రోడ్డు నిర్మాణపు పనులు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

Published: Saturday June 19, 2021
వికారాబాద్, జూన్ 18, ప్రజాపాలన బ్యూరో : గ్రీనరీ రోడ్డు నిర్మాణపు పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణపు పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెెక్టర్ మాట్లాడుతూ.. పనుల పురోగతి వివరాలను ఆర్ అండ్ బి అధికారి, కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు.  గ్రీనరీ, రోడ్డు నిర్మాణం పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా ఎన్నెపల్లి క్రాస్ రోడ్డు నుండి కలెక్టర్ కార్యాలయం వరకు చెట్లను నాటాలన్నారు.  ముందుగా గుంతలు తవ్వే పనులను చేపట్టి అటవీ శాఖ ద్వారా చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఆర్ అండ్ బి ఫారెస్ట్ మరియు మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.  కాంప్లెక్స్ లోపలి భాగంలో మిగిలిన చిన్న చిన్న పనులను వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్ రాహుల్ ను ఆదేశించారు. అనంతరం వికారాబాద్ ఏరియా ఆసుపత్రిని సందర్శించి 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలు మరియు 45 సంవత్సరాల నుండి ఆపై వయసు గల వారికి నిర్వహిస్తున్న వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. వాక్సినేషన్ చేయించుకొని అబ్సర్వేషన్లో ఉన్న వారిని పలకరించి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.  డా.రమ్యతో మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ఆసుపత్రికి గ్రీనరీతో కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి  వేణుమాధవ్ రావు, ఆర్ అండ్ బి డి ఈ శ్రీధర్ రెడ్డి, ఏ ఈ లక్ష్మినారాయన, కాంటాక్టర్ రాహుల్, డా.రమ్య తదితరులు పాల్గొన్నారు.