న్యాయవాదుల నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

Published: Wednesday March 03, 2021
వికారాబాద్ జిల్లా మార్చ్ 02 ( ప్రజాపాలన ప్రతినిధి ): హైకోర్టు న్యాయవాదులను మానవత్వం మంట గలిపేలా నడి రోడ్డుపై పాశవికంగా హత్య చేసిన నేరస్థులను కఠినంగా శిక్షించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కోర్టు ముందు భాగంలో న్యాయవాదులు నిరాహార దీక్ష చేపట్టారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ కార్యదర్శి రఫీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్టంలో నిరంకుశ నికృష్ట పాలన కొనసాగుతుందని విమర్శించారు. హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూర్ వెళ్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ న్యాయవాదుల రిలే నిరాహార దీక్షకు మద్దతు పలికి ప్రసంగించారు. న్యాయవాదులపై దాడులు, హత్యలను అరికట్టేందుకు రక్షణ చట్టం తేవాల్సిన అవసరం ఉంది అన్నారు. వామనరావు దంపతుల హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వ వైఖరికి నిదర్శనమన్నారు. న్యాయవాదుల పక్షాన బిజెపి పోరాటం కొనసాగిస్తుందన్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు.