సీజనల్ వ్యాధులను నియంత్రణపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయి పర్యవేక్షణ జిల్లా కలెక్టర్ భారత

Published: Monday July 18, 2022
మంచిర్యాల బ్యూరో,   జూలై 17,ప్రజాపాలన:
 
 
 జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నియంత్రణ దిశగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వరద పరిస్థితులు, సీజనల్ వ్యాధులు, తీసుకోవలసిన చర్యలపై రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా. రమేష్ రెడ్డి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. సుబ్బారాయుడుతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం వరద ముంపుకు గురైన ప్రాంతాలలో వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వ్యాధుల నియంత్రణలో భాగంగా వైద్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. వేడిగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలని, ఈగలు వాలిన ఆహారాన్ని తీసుకోకూడదని, త్రాగునీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, కాచి చల్లార్చి వడపోసిన నీటిని త్రాగేలా ప్రజలలో అవగాహన కల్పించాలని తెలిపారు.. అంగన్వాడీల పరిధిలో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సమయానుకూలంగా పోషకాహారాన్ని అందిస్తూ వారు ఆరోగ్యంగా ఉండే విధంగా కృషి చేయాలని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో  జిల్లాలో అవసరమైన ప్రాంతాలలో వైద్య శిబిరాలను నిర్వహిస్తూ అవసరమైన పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయాలని, వ్యాధుల నియంత్రణలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రభావిత ప్రాంతాలలో  వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ వ్యాధిగ్రస్తులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని, ప్రతి గ్రామంలో ఆశ కార్యకర్తల వద్ద మందులను నిల్వ చేయాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రాంనగర్, ఎన్.టి.ఆర్. నగర్, వైశ్య భవన్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలతో పాటు మాత శిశు కేంద్రాన్ని సందర్శించి వైద్య అధికారులు, సిబ్బందికి తగు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉపవైద్యాధికారి డా. విజయనిర్మల, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా. అరవింద్, డా. హరిచందర్ రెడ్డి, డా. ఫయాజ్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వైద్యాధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.