ఆధ్యాత్మిక సేవే మానవ మనుగడకు ప్రతీక

Published: Saturday December 17, 2022
* నవాబుపేట్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్
వికారాబాద్ బ్యూరో 16 డిసెంబర్ ప్రజా పాలన : ఆధ్యాత్మిక సేవతోనే మానవ మనుగడ వర్ధిల్లుతుందని నవాబుపేట మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్ అన్నారు. శుక్రవారం నవాబుపేట మండల పరిధిలోని ఎల్లకొండ గ్రామంలో ఊరడమ్మ విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్ మాట్లాడుతూ ఎక్కడైతే ఆధ్యాత్మికంగా భక్తి ప్రపత్తులతో పూజా కైంకర్యాలు నిర్వహిస్తారో అక్కడ పాడి పంటలు సమృద్ధిగా వృద్ధి చెందుతాయని అన్నారు. జీవరాశులకు చీడపీడల నుండి గ్రామ దేవతలు రక్షిస్తారని ప్రజల ప్రగాఢ విశ్వాసం అని స్పష్టం చేశారు. నేటి యువత ఆధ్యాత్మిక విషయాల వైపు దృష్టి సాధించాలని హితవు పలికారు. మనిషి పుట్టుకకు సార్ధకత ఏర్పడాలంటే సత్ప్రవర్తన, సద్భావన, ఆధ్యాత్మిక చింతన అంశాలు తోడ్పడతాయని వివరించారు. సన్మార్గమే మానవ మనుగడకు పునాదిరాయిలా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దైవచింతన చేయని నాడు మనిషి పుట్టుకకు అర్థం ఉండదని చెప్పారు. ఏదైనా ఒక కార్యం చేపట్టాలంటే అది విజయవంతమగుటకు దైవ ప్రార్థన చేసి ప్రారంభిస్తామని గుర్తు చేశారు.