వాగులో చిక్కుకున్న ముగ్గురు క్షేమం : కాపాడిన స్థానికులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు

Published: Friday July 16, 2021
కోరుట్ల, జూలై 15 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలం ఏకిన్‌ పూర్‌ వాగులో చిక్కుకున్న ముగ్గురువ్యక్తులు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. ఉదయం విజయ్‌ అనే 18 ఏళ్ల బాలుడు మలవిసర్జన కోసం వాగు వద్దకు వెళ్లగా వాగు కోతకు గురవడంతో బాలుడు మధ్యలోనే చిక్కుకున్నాడు. అలాగే సంగేమ్‌ గ్రామానికి చెందిన మరోవ్యక్తి కూడా వాగుమధ్యలో చిక్కుకున్నాడు. అదేవిధంగా కోరుట్ల పట్టణానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి చేపల వేటకు వెళ్లి వాగు మధ్యలోనే చిక్కుకున్నాడు. ముగ్గురు వ్యక్తులను కోరుట్ల సిఐ రాజశేఖర రాజు, ఎస్సై సతీష్‌ లు చాకచక్యంగా వ్యవహరించి గ్రామస్తులు, రెస్క్యూ టీమ్‌ సహాయంతో ముగ్గురిని సురక్షితంగా బయటకు తీశారు. ఏకిన్‌ పూర్‌ వద్ద ఒకే వాగులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకోవడంతో కొద్దిసేపు భయానక వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు ముగ్గురిని ఒడ్డుకు చేర్చడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఏకిన్‌ పూర్‌ గ్రామానికి పైన ఉన్న జగ్గసాగర్‌ మన్వుర్ వాగు ఆనకట్ట తెగిపోవడంతో వాగు ప్రవాహం పెరిగిందని అధికారులు తెలిపారు. ముగ్గురిని క్షేమంగా రక్షించిన స్థానికులకు అధికారులు శాలువాతో సన్మానించారు.