రెండో రోజు కొనసాగుతున్న రైతుల నిరాహార దీక్ష నీటిపారుదల శాఖ డీఈ పై అగ్రహం వ్యక్తం చేసిన రైతు

Published: Thursday March 09, 2023
బోనకల్, మార్చి 08 : సాగర్ నీళ్లందక మొక్కజొన్న ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో మంగళవారం ఆళ్ళపాడు గ్రామ సర్పంచ్ మర్రి తిరుపతిరావు, గోవిందపురం(ఏ) సర్పంచ్ భాగం శ్రీనివాసరావుతో పాటు పలు గ్రామాల రైతులు చేపట్టిన నిహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సర్పంచ్ మర్రి తిరుపతిరావు కు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా అతని ఆరోగ్యం క్షినిస్తుందని తెలిపారు. నిరాహార దీక్షకు బుధవారం సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ రావు, పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాలి దుర్గారావు, మాజీ ఎంపీపీ చిట్టి మోదు నాగేశ్వరరావు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించారు. ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా దీక్ష శిబిరం వైపు కన్నెత్తి చూడలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాయ మాటలు చెప్పి రైతులను మభ్యపెడుతున్నారే తప్ప సరైన సమాధానం చెప్పడం లేదని నీటిపారుదల శాఖ డిఈ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్ష శిబిరంలో సర్పంచులు మర్రి తిరుపతిరావు, భాగం శ్రీనివాసరావు మాట్లాడుతూ మా పంట పొలాలకు నీరు అందించండి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. సాగర్ ఆయకట్టు పరిధిలో మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని, నీరు అరాకొరగా విడుదల చేయడం వల్ల బ్రాంచి కాలువలు తూములకు నీరు అందడం లేదని, జిల్లా అధికారులు వారబంది విధానం ఎత్తివేసి సాగర్ జలాలు పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోవడం వల్ల ఆయకట్టు చివర భూములకు సాగునీరు అందక మొక్కజొన్న పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని అన్నారు.సాగర్ ఆయకట్టు కు విడుదల చేయాల్సిన నీరు విడుదల చేయాలని వారబంది విధానం ఎత్తివేసి సాగర్ జలాలు మార్చి చివరి వరకు నిరంతరాయంగా సరఫరా చేయాలి అని డిమాండ్ చేశారు. మొక్కజొన్న పంట కంకి గింజపోసుకున్నె దశలో ఉంది అని నాలుగు, ఐదు రోజుల నీరు అందకపోతే మండలంలో లక్ష ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బ తింటుంది అని అన్నారు.అధికారులు అందుబాటులో లేకపోవడం, రైతులకు సాగర్ నీరు అందక నష్టపోతున్నారని,చివరి భూములకు సాగునీరు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని, లేనిచో నిరాహార దీక్షను మరింత ఉదృతం చేసి ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు నాయకులు పాల్గొన్నారు.