బోడుప్పల్లో కరోనా టీకా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని వినతి

Published: Tuesday April 27, 2021
మేడిపల్లి, ఏప్రిల్ 26 (ప్రజాపాలన ప్రతినిధి)  బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా టీకా, పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ కార్పొరేటర్లు మేడ్చల్ జిల్లా వైద్య అధికారి మల్లికార్జున్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పోరేటర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా మేడ్చల్ జిల్లాలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 2 లక్షల జనాభా ఉన్న వారికి సరిపడా కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. కోవిడ్ వాక్సిన్, పరీక్షల నిర్ధారణ కోసం దూర ప్రాంతాలకు ఉప్పల్, పీర్జాదిగూడ వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నందున దానికి అనుగుణంగా అందుబాటులో ఎక్కువ  సెంటర్లను ఏర్పాటు చేయాలని తెలిపామన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన వైద్యాధికారి మరిన్ని సెంటర్లను ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారని  కార్పొరేటర్లు తెలిపారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి, జాగ్రత్తలు పాటించాలని కార్పొరేటర్లు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోటకూర అజయ్ యాదవ్, బొమ్మక్ కళ్యాణ్ కుమార్, కొత్త దుర్గమ్మ ,పొద్దుటూరు శోభారాణి, వెంకటేష్ గుప్తా, కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బిబ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.