బాల్యవివాహాల నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి జాతీయ బాలల హక్కుల కమీషన్

Published: Wednesday February 22, 2023
మంచిర్యాల బ్యూరో, ఫిబ్రవరి 21, ప్రజాపాలన :
 
బాల్య వివాహాల నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కుల కమీషన్ ప్రతినిధులు అన్నారు. మంగళవారం న్యూఢిల్లీ నుండి దూరదృశ్య మాధ్యమంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో బాల్య వివాహాల నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్య వివాహాల కలిగే అనర్థాలు, గ్రామస్థాయిలో వివాహాలు జరుగకుండా తీసుకోవలసిన చర్యలపై వివరించారు. ఈ క్రమంలో బాల్య వివాహాల నివారణ కోసం ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణ కోసం అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వివాహానికి ముందే అరికట్టేందుకు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నామని, గ్రామ పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, ఆయా గ్రామాల సర్పంచ్ల సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు. బాల్య వివాహాలపై ఉ న్నతాధికారులకు సమాచారం అందించడంపై అభ్యంతరాలు ఉన్న వారి గోప్యత కోసం 1098 నెంబర్ ద్వారా. సమాచారం అందించవచ్చని ప్రచారం నిర్వహిస్తున్నామని, బాల్య వివాహాల వలన కలిగే నష్టాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. బాల్య వివాహాల నియంత్రణలో పెళ్లికి వచ్చే వారు, క్యాటరింగ్, టెంట్, ఫంక్షన్ హాల్, ప్రింటింగ్ ప్రెస్, డి. జె. ఏర్పాట్లు చేసే వారితో పాటు ఆయా మత సంప్రదాయాల ప్రకారం వివాహాలు జరిపించే పురోహితులు, చర్చి ఫాదర్లు, ముస్లిం మత పెద్దల సహకారం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి చిన్నయ్య గారు, సి. డబ్ల్యూ.సి. సభ్యులు సైమన్, డి.సి.పి.ఓ. ఆనంద్, సెక్టోరల్ అధికారి సప్టర్ అలీఖాన్, లేబర్ శాఖ ఎ.సి. ఎల్., వైద్య ఆరోగ్య శాఖ మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, సి.ఐ. రాజు, ఎస్.ఐ. ఉదయ్ కిరణ్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.