సొసైటీ రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలి

Published: Friday September 23, 2022
సొసైటీ రైతు అంత్యక్రియలకు ఆర్థిక సహకారం అందించాలి 
* సొసైటీలో డిఏపి ఎరువును నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలి
* రైతుబంధు నిధులను బ్యాంకులు వడ్డీ కింద జమ చేసుకుంటున్నాయి
* లావని పట్టా పాస్ పుస్తకాలపై రుణాలు ఇవ్వాలి
* శివారెడ్డిపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో రైతుల ఆవేదన
వికారాబాద్ బ్యూరో 22 సెప్టెంబర్ ప్రజాపాలన : అత్యధిక వర్షపాతంతో పంటలు తీవ్రంగా నష్టపోయిన దృష్ట్యా పంట నష్ట పరిహారం చెల్లించాలని రైతులు శివారెడ్డి పెట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మసనగారి ముత్యం రెడ్డి దృష్టికి తెచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని సహకార బ్యాంకు హాల్లో అర్థ వార్షిక ఆర్థిక మహాసభ శివారెడ్డి పెట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మసనగారి ముత్యం రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. 20 21 22 వార్షిక సంవత్సర ఆర్థిక నివేదికను సొసైటీ డిప్యూటీ సీఈవో బంది రెడ్డి రైతులకు చదివి వినిపించారు. సొసైటీ రైతు చనిపోతే అంత్యక్రియలకు ఏ కొరివి పెట్టకుండా ఆర్థిక సహాయం అందజేయాలని రైతులు కోరారు. స్పందించిన చైర్మన్ మసనగారి ముత్యం రెడ్డి మాట్లాడుతూ రైతు చనిపోయినట్లు మృతి చెందిన సర్టిఫికెట్ బ్యాంకు సిబ్బందికి అందజేస్తే వెంటనే అంత్యక్రియలు నిమిత్తం తొమ్మిది వేల రూపాయలు అందజేస్తామని వివరణ ఇచ్చారు. రైతు వాటా 3000 రూపాయలు సొసైటీ వాటా 3000 రూపాయలు సెంట్రల్ బ్యాంక్ వాటా 3000 రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు సొసైటీ రైతు చనిపోతే అంత్యక్రియలకు ఇస్తున్నామని గుర్తు చేశారు. కాకపోతే మృతుని వారసులు సొసైటీ బ్యాంకు మళ్లీ మళ్లీ వచ్చి నాకు కావాలి నాకు కావాలి అని అడుగుతుండడంతో తప్పనిసరిగా విధి లేని పరిస్థితుల్లో మృతి చెందినట్లు ధృవపత్రం తెస్తేనే ఇస్తామని చెప్పవలసి వచ్చిందని వివరించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను డి ఏ పి ఎరువులు సొసైటీలో అందుబాటులో ఉంచాలని సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. అందుకు చైర్మన్ స్పందిస్తూ నాణ్యమైన విత్తనాలు సొసైటీ లోనే అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. డి ఏ పి ఎరువు గురించి పై అధికారులకు వివరిస్తానని స్పష్టం చేశారు. రైతుబంధు కింద ఇచ్చే నిధులను బ్యాంకు యాజమాన్యం వారు వడ్డీ కింద జమ కట్టుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత రైతులపై సొసైటీ యాజమాన్యం కనికరం చూపి తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని దళిత రైతులు విజ్ఞప్తి చేశారు. అత్యధిక వర్షపాతం నమోదవడముతో వేసిన పంటలు పూర్తిగా నాశనమయ్యాయి అని రైతులు కన్నీటి పరితమవుతూ సభ దృష్టికి తెచ్చారు. చైర్మన్ మాట్లాడుతూ పంట నష్టం పై నష్టపరిహారం గురించి ప్రభుత్వ పెద్దలకు విన్నవిస్తానని హామీ ఇచ్చారు. లావని పట్టా పాసు పుస్తకాలపై సొసైటీ ద్వారా రుణాలు అందజేయాలని పలువురు రైతులు సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల పరిధిలోని మదన్ పల్లి గ్రామానికి చెందిన ఒక మహిళా గ్రూపు నాయకురాలు లోను కట్టడానికి వస్తే లోను జమ చేసుకోలేదని మహిళా నాయకురాలు సభాముఖంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన సీనియర్ అసిస్టెంట్ రాధా నాయర్ గ్రూపు సభ్యులందరూ వచ్చి లోను కడితే గ్రూపు పేరు మీద రసీదు ఇవ్వడానికి వీలవుతుందని వివరించారు. మహిళా నాయకురాలు పేరుమీద రసీదు ఇవ్వడానికి వీలు పడదని చెప్పారు. వికారాబాద్ మండల పరిధిలోని బురాన్ పల్లి తండా గ్రామానికి చెందిన రమేష్ సొసైటీ ద్వారా లక్షా 62వేల 200 రూపాయలు రుణం తీసుకొని తిరిగి మొత్తం చెల్లించినా ఇంకా 54 వేల రూపాయలు బాకీ ఉన్నావని బ్యాంకు సిబ్బంది తెలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ చైర్మన్ స్పందిస్తూ రమేష్ తీసుకున్న రుణానికి సంబంధించిన పూర్తి వివరాలను బ్యాంకుకు వస్తే పూర్తి సమాచారం అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పిఎసిఎస్ ఉపాధ్యక్షుడు గడ్డమీది పాండు ముదిరాజ్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్ రత్నారెడ్డి సొసైటీ డైరెక్టర్లు సొసైటీ సీఈఓ ప్రభులింగం డిప్యూటీ సీఈవో బంది రెడ్డి సీనియర్ అసిస్టెంట్ రాధా నాయర్ బ్యాంక్ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.