కరోనాను తరిమికొట్టేందుకు వ్యాక్సినేషన్ వేయించుకోవాలి : ధర్మాపూర్ గ్రామ సర్పంచ్ బోడ అనిల్

Published: Friday October 08, 2021
వికారాబాద్ బ్యూరో 07 అక్టోబర్ ప్రజాపాలన : కరోనాను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ను వేయించుకోవాలని ధర్మాపూర్ సర్పంచ్ బోడ అనిల్ పిలుపునిచ్చారు. గురువారం వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని ధారూర్ మండలానికి చెందిన ధర్మాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ బోడ అనిల్ అధ్యక్షతన కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ను ఎంపిహెచ్ఎ (ఫిమేల్) మహబూబి, పంచాయతీ కార్యదర్శి శివసాయి రాఘవన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బోడ అనిల్ మాట్లాడుతూ.. బుధవారం రాత్రి 19 వ్యాక్సినేషన్ తీసుకోవాలని డప్పు చాటింపు చేయించామని స్పష్టం చేశారు. ధర్మాపూర్ గ్రామంలో 324 మంది వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో ఆడవారు 167 మగవారు 157 మంది ఉన్నారని వివరించారు. గురువారం 150 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారని చెప్పారు. గురు, శుక్రవారం రెండు రోజుల్లో ధర్మాపూర్ గ్రామస్థులు అందరికీ వ్యాక్సినేషన్ వేయించి పూర్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒక్క వాయిల్లో 10 మందికి సరిపోయే వ్యాక్సినేషన్ మందు ఉంటుందని వివరించారు. గ్రామస్తులందరూ వాక్సినేషన్ వేయించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు. అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయించి కరోనా మహమ్మారిని మా ఊరి పొలిమేరను దాటిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గూడెం శాంతమ్మ, వార్డు మెంబర్లు, ఆశా వర్కర్ కే.మంజుల అంగన్వాడీ టీచర్ నర్సమ్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.