ఎద్దేడిసిన యవుసం రైతేడిసిన రాజ్యం బాగుపడదు

Published: Thursday July 22, 2021
మాజీ ఎంఎల్ఏ చింతా రామచంద్రారెడ్డి
వికారాబాద్ 21 జూలై ప్రజాపాలన బ్యూరో : ఎద్దేడిసిన యవుసం రైతేడిసిన రాజ్యం బాగుపడదని బిజెపి మాజీ ఎంఎల్ఏ చింతా రామచంద్రారెడ్డి విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కొండా బాలకృష్ణారెడ్డి వేడుక వేదికలో జిల్లా అధ్యక్షుడు తొడిగల సదానందరెడ్డి ఆధ్వర్యంలో బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో సక్రియమైన, క్రియాశీలక కమిటీలను నియమించాలని సూచించారు. ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో అవినీతి, అక్రమాలను రూపుమాపే విధంగా స్వచ్ఛమైన పాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అని కొనియాడారు. దేశంలోని జఠిలమైన దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యలను ఒక్క రక్తం చుక్క రాకుండా పరిష్కరించడం విశేషమని పేర్కొన్నారు. దేశ రాజకీయ పగ్గాలు మూడవసారి చేపట్టేందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికునిలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని గుర్తు చేశారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదంతో బిజెపి ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. 2023లో జరిగే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై బిజెపి జెండా ఎగురవేద్దాం. ఈ సమావేశంలో మాజీమంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్, జిల్లా ఇంచార్జ్ కాసం వెంకటేశ్వర్లు, చేవెళ్ళ పార్లమెంట్ ఇంచార్జ్ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటిగారి శివరాజ్, కరణం ప్రహ్లాదరావు, జిల్లా సీనియర్ నాయకులు కోకట్ మాధవరెడ్డి, ఘణపురం వెంకటయ్య, పాండుగౌడ్, రమేష్ కుమార్,  విజయభాస్కర్ రెడ్డి, తాండూర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సింధూజగౌడ్, రాచ శ్రీనివాస్ రెడ్డి తదితర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.