రాళ్లచిట్టంపల్లిలో ఇల్లు కూలి వ్యక్తి మృతి

Published: Friday July 16, 2021
పల్లె ప్రగతిలో జిపి నుండి నోటీసు ఇచ్చినా స్పందించని ఇంటి యజమాని
మరో ఇంటి గోడలో బయటి వరుస కూలింది
అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య ధోరణి
వికారాబాద్ జూలై 15 ప్రజాపాలన బ్యూరో : జిల్లా పరిధిలో గల వికారాబాద్ మండలానికి చెందిన రాళ్ళచిట్టంపల్లి గ్రామంలో భారీ వర్షానికి బండల ఇల్లు కూలి వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్ ముఫ్లయా యాస్మిన్ భర్త గౌస్ లు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ రాష్ట్రం నుండి గత 10 సంవత్సరాల క్రితం షబ్బీర్ (38) రాళ్ళచిట్టంపల్లికి బతుకుదెరువు కోసం వచ్చిండు. రాళ్ల చిట్టెంపల్లి గ్రామానికి చెందిన సమ్రీన్ను పెళ్లి చేసుకొని దినసరి కూలీగా అద్దె ఇంటిలో జీవనం కొనసాగించేవాడు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు మగపిల్లలు ఒకరు ఆడపిల్ల. పెద్ద కుమారుడు ఇమ్రాన్ (7), రెండవ కుమారుడు ఇర్ఫాన్ (5), మూడవ సంతానం షాఫియా (3). మృతుని భార్య సమ్రీన్ తల్లి గారింట్లో బుధవారం విందు కార్యక్రమం ఉండడంతో పిల్లలతో కలిసి వెళ్ళారు. విందు కార్యక్రమం అనంతరం మృతుడు షబ్బీర్ తన భార్యా పిల్లలను అత్తగారింట్లో వదిలిపెట్టి తాను అద్దెకు ఉంటున్న ఇంటికి చేరుకున్నాడు. బుధవారం రాత్రి కురిసిన నిరంతర వర్షానికి బండల ఇంటి గోడలు పూర్తిగా నానాయి. గాఢ నిద్రలో ఉన్న షబ్బీర్ పై నానిన గోడతో పాటు పైకప్పు బండలు మీదపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటి పక్క పిల్లవాడు మహమ్మద్ చూసి మృతుని భార్య సమ్రీన్ కు సమాచారం అందజేశాడు. మృతుని కుటుంబ సభ్యులు రాళ్ళచిట్టంపల్లి గ్రామ సర్పంచ్ ముఫ్లయా యాస్మిన్ భర్త గౌస్ కు సమాచారం అందజేశారు. సర్పంచ్ భర్త గౌస్ ఎంఆర్ఓ మరియు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాళ్ళచిట్టంపల్లి గ్రామం ధారూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడంతో ఎస్ఐ సురేష్ గ్రామానికి వచ్చి విచారణ జరిపి పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య సమ్రీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పల్లె ప్రగతిలో భాగంగా పాడుబడిన ఇండ్లను గుర్తించి కూలగొట్టి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని గ్రామస్థులు అన్నారు. మొల్ల షబ్బీర్ నల్లరాతి ఇంటికి రెండు వరుసల గోడ ఉన్నది. బుధవారం రాత్రి కురిసిన వాన కారణంగా బయటి పక్క వరుస గోడ కూలింది. కానీ ప్రాణ నష్టం, ఆస్థి నష్టం జరుగలేదు. ఇకనైనా గ్రామాధికారులు ప్రజా ప్రతినిధులు నిక్కచ్చిగా వ్యవహరించి ప్రాణ నష్టం జరుగకుండా చూస్తారని ఆశిద్దాం.