నాణ్యతా కలిగిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి** జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం**

Published: Tuesday February 14, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి13 (ప్రజాపాలన, ప్రతినిధి) :నాణ్యత ప్రమాణాలు, ఐ.ఎస్.ఐ. మార్కు కలిగిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం లో  కేంద్ర ప్రభుత్వ పౌరసరఫరాలు, వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ప్రమాణాల సంస్థ (ఐ. ఎస్. ఐ.) పై జిల్లా అధికారులకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్,శిక్షకులు రాకేష్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులు గృహ ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసే సమయంలో నాణ్యత ప్రమాణాలతో పాటు ఐ.ఎస్.ఐ. మార్కును తప్పనిసరిగా పరిశీలించాలని, ఆ దిశగా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. పరిశ్రమలు, లేబరేటరీలు ఇతర ఉత్పత్తులపై జాతీయ ప్రమాణాల సంస్థ అనుమతులు జారీ చేయడం జరుగుతుందని, బంగారం, వెండి వస్తువులపై ఐ.ఎస్.ఐ మార్కు తప్పనిసరిగా చూడాలని, ఐ ఎస్ ఐ మార్కు లేనిపక్షంలో ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కల్తీ ఉన్నట్లయితే వినియోగదారుల ఫోరం ద్వారా నష్టపరిహారం పొందవచ్చని, వస్తువుల కొనుగోలు సమయంలో నాణ్యత పరీక్షించుకోవాలని తెలిపారు. తయారీదారులు, వినియోగదారుల మధ్య నమ్మకం ఉండాలని, వస్తువుల తయారీలో నాణ్యత పాటించాలని తెలిపారు. జాతీయ ప్రమాణాల సంస్థ అనుమతి జారీ చేసిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేసే విధంగా ప్రజలలో అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాదు నుండి వచ్చిన శిక్షకులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులకు వివిధ అంశాలపై వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.