ఏపూరి సోమన్నపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలి*మద్దెల ప్రసాదరావు

Published: Thursday July 07, 2022

మధిర జులై 6 ప్రజాపాలన ప్రతినిధి వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర దళిత నేత కళాకారులు ఏపూరి సోమన్నపై దాడి చేసిన టిఆర్ఎస్ నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా దళిత విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల ప్రసాదరావు చింతకాని మండల అధ్యక్షులు వాకా వీరారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మధిరలో వారు విలేకరులతో మాట్లాడుతూ హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అనేక ఆక్రమాలకు పాల్పడుతున్నారని, ఇదే విషయాన్ని వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న ఆధారాలతో సహా ప్రశ్నించడం జరిగిందన్నారు. దీనిని తట్టుకోలేక టిఆర్ఎస్ నాయకులు ఏపూరి సోమన్నపై దాడికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే వైయస్సార్ తెలంగాణ పార్టీ లక్ష్యం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడే పార్టీలు లేకపోవటం వల్లే వైయస్ షర్మిల నూతన పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. వైఎస్ షర్మిల హుజూర్ నగర్ లో చేపట్టిన పాదయాత్రకు భారీ స్పందన రావడంతో బెంబేలెత్తిన ఎమ్మెల్యే సైదిరెడ్డి, తన అనుచరుల చేత దళిత నేతగా ప్రముఖ కళాకారుడుగా ఖ్యాతి గడించిన ఏపూరి సోమన్నపై  దాడి చేయించారని వారు పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ దాడులకు వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు ఎవరూ భయపడరన్నారు. దళితుల జోలికి వస్తే రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు ఉండవన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. అధికార మదంతో ఉన్న టిఆర్ఎస్ నాయకులకు రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతుతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బుద్ధి చెబుతుందని వారు హెచ్చరించారు. ఏపూరి సోమన్నపై దాడి చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరులపై చర్యలు తీసుకునే వరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ తెలంగాణ దళిత విభాగం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని వారు తెలిపారు. ఏపూరి సోమన్నపై దాడులకు ప్రోత్సహించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి పై టిఆర్ఎస్ అధిష్టానం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ముదిగొండ మండల అధ్యక్షులు సామినేని రవి పాల్గొన్నారు.