పట్టు సాగుతో అధిక లాభాలు పొందాలి

Published: Tuesday November 15, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 14 నవంబర్ ప్రజా పాలన : పట్టు సాగులో రైతులు అధిక లాభాలు పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో  మూడు రోజులపాటు నవంబర్ 14 నుండి 16 వరకు నిర్వహించే ఉద్యానవన, పట్టు పరిశ్రమ రైతు అవగాహన సదస్సు, రైతు నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమానికి  జిల్లా కలెక్టర్ నిఖిల ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వల గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో పట్టు పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు రైతులలో పట్టు సాగుపై పూర్తి అవగాహన కల్పిస్తూ రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు సూచనలు,  సలహాలు అందించాలని తెలిపారు.  పట్టు సాగు చేసుకునేందుకు రైతులను పెద్ద మొత్తంలో ప్రోత్సహించాలని  ఆమె అన్నారు.  ఎప్పటికీ ఒకే రకమైన పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించేలా చూడాలన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పట్టు పరిశ్రమకు ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నాయని, రైతులకు పట్టు సాగుకు అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడాలని కలెక్టర్ రైతులకు సూచించారు. పట్టు సాగు ఒక ఎకరానికి సుమారు రెండు లక్షల వరకు సంపాదించే అవకాశం ఉన్నందున రైతుల్లో బలమైన నమ్మకాన్ని కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.  గతంలో పట్టు సాగు చేసిన రైతులు ఇప్పుడు శిక్షణ పొందుతున్న రైతులకు ప్రోత్సాకులుగా ఉంటూ పనిచేయాలని కలెక్టర్ సూచించారు.   శిక్షణలో పాల్గొంటున్న రైతులు ఎటువంటి సందేహాలు ఉన్న నివృత్తి చేసుకోవాలని ఆమె తెలిపారు. శిక్షణ పొందుతున్న రైతులు భవిష్యత్తులో ఇతరులకు పూర్తి అవగాహనతో శిక్షణలు ఇచ్చేలా తయారు కావాలని ఆమె తెలిపారు. జిల్లాలో రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వారిలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన శిక్షణా తరగతులు నిర్వహించేందుకు ప్రోత్సహిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రాంతీయ పట్టు సాధన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కే ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారని వారిని గుర్తించి పట్టు సాగుకై ప్రోత్సహిస్తున్నట్లు  తెలిపారు. గతంలో మార్కెట్ సదుపాయం లేనందున రైతులు ముందుకు రాలేకపోయారని ఇప్పుడు రైతులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మార్కెట్ ను అందుబాటులోకి తేవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రగతి పథంలో పట్టు పరిశ్రమ
 "  పట్టు కరదీపిక  " బుక్ లెట్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన,  పట్టు పరిశ్రమ అధికారి డి. చక్రపాణి, పట్టు పరిశ్రమల సహాయ సంచాలకు ఎ. మల్లికార్జున్, శాస్త్రవేత్తలు డాక్టర్ రాజాదురై , డాక్టర్ వినోద్ కుమార్, యాదవ్ డాక్టర్ మాధురి, పట్టు పరిశ్రమల ఉప సంచాలకులు సుధాకర్  , సహాయ సంచాలకులు మురళీకృష్ణ , రవి ప్రసాద్ ల తో పాటు రైతులు పాల్గొన్నారు.