అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కాల్చి వేయాలి

Published: Wednesday October 27, 2021

కోరుట్లలో అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో

కోరుట్ల, అక్టోబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసే నిందితులను ఇకనుండి కాల్చి వెయ్యాలని అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం కోరుట్ల పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశంతో పాటు రాష్ట్రంలో కూడా అనేక ప్రాంతాలలో మహనీయులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. కొంతమంది దేశద్రోహులు పనిగట్టుకొని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టం తీసుకువచ్చి అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసే వారిని గుర్తించి కాల్చి వేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రతిరోజు దేశంలో ఏదో ఒక ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాలకు అవమానం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రపంచంలోని ఇతర దేశాలలో అంబేద్కర్ ను దైవంగా భావిస్తూ పూజిస్తున్నారు అని తెలిపారు. మన దేశానికి దిశానిర్దేశం చూపిన మహనీయునికి అవమానం జరగటం చాలా బాధాకరం అన్నారు. అంబేద్కర్ దేశ ప్రజలందరికీ దైవం లాంటి వాడిని కొనియాడారు. అంబేద్కర్ విగ్రహాల వద్ద ప్రభుత్వం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. బైంసాలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ రాష్ట్ర నాయకులు ఉయ్యాల నర్సయ్య, బలిజ రాజారెడ్డి, రాసా భూమయ్య, డివిజన్ అధ్యక్షుడు ఉయ్యాల శోభన్, కార్యదర్శి చిట్యాల కరుణాకర్, కల్లూరు సర్పంచ్ వంతడుపుల అంజయ్య, కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు తిరుమల గంగాధర్, కొంతం రాజo, సంఘ నాయకులు సామల వేణుగోపాల్, కంభం ఆనంద్, ఉయ్యాల శేఖర్, బలిజ శివప్రసాద్, ఇంద్రాల హరీష్, సామర్ల దశరథం, నగేష్, కృష్ణంరాజు, వికాస్, గంగాధర్, గంగారెడ్డి, పట్టణ మండలం అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.