ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న బాధ్యులపై చర్యలు తీసుకోవాలి తాండూర్ మండల బిజెపి నాయకుల డి

Published: Wednesday November 30, 2022
బెల్లంపల్లి నవంబర్ 29 ప్రజా పాలన ప్రతినిధి:  మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని తాండూర్, రేచిని, కిష్టంపేట, కొత్తపల్లి, మాదారం గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన అక్రమ లే అవుట్ల పై, ప్రభుత్వ భూముల ఆక్రమణ, చెరువుల శిఖం, మత్తడి కాలువల, భూముల ఆక్రమణదారుల పై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకొవాలని తాండూర్ మండల బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. 
సోమవారం బెల్లంపల్లి బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్ లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు, మండలంలోని పలు గ్రామ పంచాయతీలలో, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు డిటిసీపి, అనుమతి,నాలా కన్వర్షన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూముల్లో, ఏజెన్సీలోని అసైన్డ్ భూముల్లో, అక్రమ లే అవుట్లు ఏర్పాటు చేసి, అమ్ముకుంటూ ప్రభుత్వ, ఆదాయానికి నష్టం  జేస్తున్నారని అన్నారు.
 రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసపూరిత మాటలతో
అమాయక ప్రజలకు ఓపెన్ ప్లాట్లను అమ్ముతుండటంతో  కొనుగోలు చేసిన ప్రజలకు ఇంటి నిర్మాణం కోసం అనుమతులు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తాండూర్, రేచిని గ్రామ పంచాయతీ పరిధిలోని పలు సర్వే నం, లోని వ్యవసాయ భూముల్లో ఎలాంటి  అనుమతి లేకుండా,  కోడిప్యాక రంజిత్ కుమార్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి, లే అవుట్లు  చేసి,   ధరణి పోర్టల్ లో
గుంటల చొప్పున రిజిస్ట్రేషన్ చేపించి కొనుగోలుదారుల వద్ద నుండి డబ్బులు తీసుకుంటున్నారని, దీనితో ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలుగుతుందని తెలిపారు.  
రేచిని గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నం. 647, సర్వే సం. 648 లోగల ప్రభుత్వ భూమిని, రామయ్య చెరువు, కొత్తచెరువు, భీమయ్య చెరువు, డోంగుల్ చెరువు, చింతకుంట చెరువుల, శిఖం భూములు, చెరువుల మత్తడి కాలువల, పాత రోడ్లు ఆక్రమణకు గురయ్యాయని, అక్రమ లే అవుట్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణల పైన విచారణ జరిపి,
చర్య తీసుకోవాలని వారు కోరారు.   గతంలో పలువురు అధికారులకు  ఫిర్యాదు చేయగా, సంబంధిత అధికారులు అక్రమ లే అవుట్ల వద్ద హెచ్చరిక బోర్డులు  ఏర్పాటు చేశారని, వాటిని ఒక్కరోజు కూడా గడవకముందే గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారని  ఆరోపించారు.
రేచిని గ్రామ పరిధిలోని సర్వే నం. 206 లోని 5 ఎకరాల పద్నాలుగు గుంటల  ఇనామ్ భూమిని ఆంధ్రప్రదేశ్ ఇనామ్ రద్దు చట్టం - 1955, నిబంధనలకు విరుద్ధంగా, ఓఆర్సీ లేకుండానే, రెవెన్యూ అధికారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కోడిప్యాక రంజిత్ కుమార్ తో కుమ్మక్కై పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారని, కోడిప్యాక రంజిత్ కుమార్, తన రాజకీయ హోదా, డబ్బును ఉపయోగించి తన తండ్రి కోడిప్యాక భాస్కర్ స్నేహితులకు,సహితం ఇనామ్ భూమిని  ఓఆర్సీ లేకుండా అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయించారని వీటన్నింటి పైన, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు, సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల బిజెపి ప్రధాన కార్యదర్శి భాస్కర్ గౌడ్, బీసీ మోర్చా ఉపాధ్యక్షులు ఆడే శ్రీనివాస్, పార్టీమండల ఉపాధ్యక్షులు బార్కోట్ సోమయ్య, బామినపల్లి ఆనంద్, సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.