ప్రజావాణి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Tuesday June 21, 2022
మంచిర్యాల బ్యూరో, జూన్ 20, ప్రజాపాలన  :
 
ప్రజావాణి  లో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిస్కరిం చాలని  జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాలబస్తీకి చెందిన జిల్లు రవీందర్ తాను బి.టెక్. పూర్తి చేశానని, తనకు ఉపాధి అవకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణానికి చెందిన నల్ల రమేష్ తన దరఖాస్తులో తనకు తిమ్మాపూర్ శివారులో ఉన్ప భూమి  కొంత భాగం రోడ్డు విస్తరణలో పోయిందని, ఆ భూమికి సంబంధించి పరిహారం ఇప్పించాలని కోరారు. హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామానికి చెందిన దర్వాజ వెంకటస్వామి తనకు ముల్కల్ల శివారులో భూమి ఉందని, ఇందు నిమిత్తం ధరణి పోర్టల్లో ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకున్నానని, ఆ సమయంలో భూమి విస్తీర్ణం తప్పుగా చూపుతున్నందున బుక్ చేసుకున్న స్లాట్ను రద్దు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మందమర్రి మండలం అమరవాది గ్రామానికి చెందిన రొడ్డ మల్లేష్ తనకు అమరవాది శివారులో భూమి ఉందని, ఇట్టి భూమిని ఆన్లైన్లో నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకము మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. జన్నారం మండలం మహ్మదాబాద్ గ్రామానికి చెందిన జాడి దుర్గయ్య తనకు గల చింతగూడ గ్రామ శివారులోని భూమిలో సాగు చేసుకుంటూ జీవించేవాడినని, ఇట్టి భూమిలోకి కొంత మంది దౌర్జన్యంగా రాగా కోర్టులో కేసు నమోదు చేయడం జరిగిందని, కేసు కొనసాగుతుండగా వారు భూమిలోకి ప్రవేశించి నేను సాగు చేసిన పంట కోస్తున్నారని, ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. వేమనపల్లి మండలం సూరారం గ్రామానికి చెందిన అలం మొండి తన కుటుంబం గత 25 సం॥లుగా సూరారం గ్రామ శివారులోని తమ భూమిలో సాగు చేసుకుంటూ జీవిస్తుండగా ఇట్టి భూమిలో స్థానిక నాయకులు వ్యక్తిగత కక్షతో ప్రభుత్వం ద్వారా మంజూరైన క్రీడా ప్రాంగణంను ఏర్పాటు చేయుటకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. అంతకు ముందు మందమర్రి మండలంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిస్తున్న దరఖాస్తులపై ఆయా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా కృషి చేయాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.