ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయాలి

Published: Tuesday August 24, 2021

రేషనలైజేషన్ పేరుతో పాఠశాలల మూసివేతను నిలిపివేయాలి
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జగన్

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 23 ప్రజా పాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు, రీయంబర్స్ మెంట్ తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఇబ్రహీంపట్నం పాషా, నరహరి స్మారక కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు సంవత్సరాలు 2019-2020, 2020-2021 విద్యాసంవత్సరాల ఉపకార వేతనాలు, రీయంబర్స్ మెంట్స్ మొత్తం 3,850 కోట్లు రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అంతకంటే ముందు సంవత్సరాలు కూడా బి.సి.విద్యార్ధుల ఉపకార వేతనాలు పెండింగ్ ఉన్నాయన్నారు. కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థులు వేరే కోర్సుల్లో చేరాలంటే వారి ఫీజులు బకాయిలు ఉన్నాయని ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు వారి సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు. ఫలితంగా విద్యార్ధులే ఫిజులు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్.సి., ఎస్.టి. విద్యార్ధులకు ఉపకార వేతనాలకు కేంద్రం ఇచ్చే నిధులు కూడా ఇతర శాఖలు వాడుకోని రాష్ట్ర విద్యార్ధులకు ఇవ్వడం లేదు. బడ్జెట్ కాలేజీలు, మధ్యతరగతి కాలేజీలు ప్రధానంగా ఫీజు రీయంబర్స్ మెంట్స్ ఆధారపడి నడుస్తున్న విద్యాసంస్థలు మూతపడుతున్నాయి.వారు రోడ్డున పడే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నిత్యవసర ధరలు పెరిగిన విద్యార్థుల ఉపకార వేతనాలు పెరగడం లేదు. తక్షణమే పెంచి అమలు చేయాలి. ఉపకార వేతనాలు రాకపోవడంతో ఫిజులు కట్టలేక ఈ మధ్యే లావణ్య అనే ఇంజనీరింగ్ విద్యార్ధిని వనపర్తిలో ఆత్మహత్య చేసుకుంది. విధ్యార్ధులు చనిపోతున్న ప్రభుత్వం స్పందించడంలేదు. ఎన్నికల సందర్భంగా ఖర్చు చేస్తున్న డబ్బు లో పావువంతు నిధులు కేటాయించిన ఈ సమస్య తీరీపోతుంది.కానీ ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. పాఠశాలలు నడవటమే లేదని, విద్యార్థుల నమోదు పూర్తి స్థాయిలో జరగనేలేదని, సంక్షేమ హాస్టళ్ళు తెరవక పోవటంతో అనుబంధ పాఠశాలల్లో అడ్మిషన్లు లేనే లేవని, కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయుల క్యాడర్‌ విభజన ఓ కొలిక్కి రానేలేదని, ఇంతటి అస్తవ్యస్త పరిస్థితుల్లో హడావుడిగా ఉపాధ్యాయ పోస్టుల రేషనలైజేషన్‌ (హేతుబద్ధీకరణ) చేయాల్సిన అవసరం విద్యాశాఖకు ఏమొచ్చిందని ప్రశ్నించారు. భవిష్యత్తులో టీచర్‌ పోస్టులు భర్తీ చేయకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపడుతున్నదని, పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన పూర్తి స్థాయిలో ప్రారంభమై, విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత తాజా గణాంకాల ఆధారంగా మాత్రమే రేషనలైజేషన్‌ గురించి ఆలోచించాలని అప్పటివరకు రేషనలైజేషన్‌ ప్రక్రియను వాయిదా వేయాలని అన్నారు. ఖాళీగా ఉన్న టిచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మద్దెల శ్రీకాంత్, నాయకులు తరంగ్, సీహెచ్ వినోద్, సీహెచ్ సాయి కుమార్, జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.