నేటి జిల్లా మహాసభకు జర్నలిస్టులు తరలిరండి* *టీయూడబ్ల్యూజే( ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్

Published: Wednesday September 28, 2022
ఆసిఫాబాద్ : దళిత బంధు మాదిరిగా జర్నలిస్టుబంధు పథకం ప్రవేశపెట్టి అర్హులైన జర్నలిస్టులందరికీ పది లక్షల ఆర్ధిక సహాయం అందించి జర్నలిస్టుల న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం (టీయూడబ్ల్యూజే- ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ డిమాండ్ చేశారు. మంగళవారం టియుడబ్ల్యూజే జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులు పాత్ర కీలకంగా వహించారని కానీ స్వరాష్ట్రంలో జర్నలిస్టులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. జర్నలిస్టులకు కనీసం ఇప్పటివరకు  ఇంటి స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హక్కుల సాధనకై తమ సంఘం పోరాడుతుందని ఆయన అన్నారు. జర్నలిస్టుల సమస్యలపై ఆరు దశాబ్దాల నుంచి రాజీలేని పోరాటాలు చేస్తున్న వారసత్వం తమ సంఘం కు ఉందని పేర్కొన్నారు. ఈనెల 28వ తేదీన కొమురం భీం ఆసిఫాబాద్  జిల్లా కేంద్రంలో నిర్వహించబోతున్న జిల్లా ద్వితీయ మహాసభకు జిల్లాలోని ప్రజా ప్రతినిధులు టీయూడబ్ల్యూజే రాష్ట్ర బాధ్యులు హాజరవుతున్నారని తెలిపారు. జర్నలిస్టుల హక్కుల సాధనకై చేపడుతున్న జిల్లా మహాసభకు జిల్లాలోని జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్ , టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణంరాజు, టీయూడబ్ల్యూజే నాయకులు వేణుగోపాల్ , మేకల శ్రీనివాస్,సురేష్ చారి, రాందాస్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.