కళాశాల భవన నిర్మాణం త్వరలో ప్రారంభం – తాండూరు జూనియర్ కళాశాలకు రూ. 2 కోట్లు – ఎమ్మెల్యే పైలెట

Published: Thursday December 22, 2022

తాండూరు పట్టణంలోని ప్రభుత్వ కాలేజీలో కొత్త బిల్డింగ్‌ నిర్మాణానికి సర్కారు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి సహకారం, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చొరవతో కళాశాలకు రూ. 2 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాండూరులో నిజాం కాలంలో కట్టిన ప్రభుత్వ కళాశాలలో గత కొన్నేళ్ల నుంచీ సమస్యలు తిష్టవేశాయి. కొన్ని నెలల క్రితం కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విద్యార్థుల ద్వారా సమస్యలు తెలుసుకున్నారు. అదేసమయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెంటనే విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి దృష్టికి కళాశాల సమస్యలను తీసుకెళ్లారు. ఇందుకు మంత్రి స్పందించి పరిష్కారానికి భరోసా అందించారు. తాజాగా ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ. 2 కోట్లు మంజూరు చేసింది. ఇంటర్ బోర్డు ద్వారా ఈ నిధులను ఖర్చుచేయాలని ఉత్తర్వులలో స్పష్టం చేసింది. ఈ నిధులతో కళాశాలలో అదనపు గదులు, ప్రహారి, మరుగుదొడ్లు నిర్మించాలని ప్రతిపాదనలు సూచించింది. దశాబ్దాలుగా కొత్త భవనం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు, ప్రజల ఆకాంక్ష ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చొరవతో తీరింది. ఇందుకు విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజలు మంత్రి సబితా రెడ్డితో పాటు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు తెలంగాణలోనే 2400 మందితో అత్యధిక విద్యార్థులను కలిగిన కళాశాలగా తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల గుర్తింపు పొందడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.