కలెక్టర్ కు సైదాపురం గ్రామస్తుల వినతిపత్రం

Published: Thursday April 01, 2021
మధిర, మార్చి 31, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వి కరణ్ పర్యటన  సందర్భంగా మర్లపాడు సొసైటీ అధ్యక్షులు కటికల సీతారామరెడ్డి ఆధ్వర్యంలో సైదాపురం గ్రామస్తులు కలసి కలెక్టర్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సైదాపురం గ్రామ పరిధిలో గురుకుల పాఠశాల నిమిత్తం కేటాయించిన భూమి లో మట్టి తవ్వకాలు, ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలింపు పై ఫిర్యాదు.   తేది.31-03-2021 మధిర శ్రీయుత గౌరవనీయులైన ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి దివ్యనముఖమునకు .... ఖమ్మం జిల్లా, మధిర మండలం, సైదెల్లిపురం గ్రామ పంచాయితి కాపురస్తులు వ్రాసుకొను దరఖాస్తు... అయ్యా, విషయం : గురుకుల పాఠశాల కొరకు కేటాయించినటువంటి భూమి నుండి అక్రమముగా మట్టిని తోలుట గురించి. మధిర మండలములోని సైదెల్లిపురం గ్రామ పంచాయితి పరిధిలో గల మాటూరు రెవిన్యూ నందు గతములో ఉన్నటువంటి పాలవర్గం తీర్మానము చేసి య. 3.20 గుంటల భూమిని గురుకుల పాఠశాల కొరకు కేటాయించి ప్రభుత్వమునకు స్వాధీనపర్చనైనది. ఇట్టి భూమి పోను మిగిలినటువంటి భూమిని డబుల్ బెడ్ రూమ్ గృహములకు కేటాయించినారు. ప్రసుత్తము ఉన్నటువంటి సైదెల్లిపురం గ్రామ సర్పంచ్ గ్రామములోని వ్యవసాయ భూములకు వెళ్తున్న డొంక రోడ్లకు పోస్తున్న రోడ్లకు పర్సనల్ కాంట్రాక్ట్ చేస్తున్నాడు. ఇట్టి రోడ్లకు గాను గురుకుల పాఠశాల కొరకు కేటాయించిన భూమిని ఎటువంటి అనుమతులు పొందకుండా నుమారు 10 అడుగుల లోతు వరకు త్రవ్వి సదరు మట్టిని అక్రమముగా రోడ్లకు పోస్తున్నారు. ది. 28–03–2021వ తేది అనగా ఆదివారము రోజున ప్రభుత్వ అధికారులు లేని సమయములో అక్రమముగా మట్టి త్రవ్వుతుండగా ఇట్టి విషయమై గ్రామ ప్రజలు అడ్డుకొనగా దౌర్జన్యముగా వారిని నెట్టి వేసినాడు. ఈ విషయమును గ్రామ ప్రజలు లోకల్ పోలీస్ స్టేషన్ కు మరియు మండల తహసీల్దార్ గారికి తెలియపర్చగా వారు వచ్చి మట్టి త్రవ్వకాన్ని నిలుపుదల చేసినారు. అప్పటికి సుమారు 30 ట్రిప్పులు తోలినారు. ఈ మట్టి తోలుటలో స్థానిక మండల తహసీల్దార్ మరియు సంబంధిత అధికారుల అండదందలు ఉన్నందున సదరు సర్పంచ్ ఎవ్వరిని లెక్క చేయటము లేదు. ఈ విషయమై సదరు మట్టి తోలిన వారిపై గాని మట్టి తోలిన ట్రాక్టర్లు, జేసీబీలు తోలిన వ్యక్తుల పై ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. అక్రమముగా మట్టి తోలుచున్నపుడు తీసిన ఫోటోలు కూడా మా వద్ద కలవు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ప్రక్కనే ఉన్నా కూడా వాటికి 10 మీటర్ల దూరములో సుమారు 10 అడుగుల లోతు త్రవ్వటం వలన అక్కడ ఆడుకునే పిల్లలకు చాలా ప్రమాదం జరుగు అవకాశము కలదు. కావున ఈ విషయమై మీరు తగు విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకొని ప్రభుత్వమునకు కేటాయించిన భూమిని రక్షించగలరని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను రక్షించగలరని మిమ్ములను కోరుచున్నాను . ఇట్లు, తమ విధేయులు, సైదెల్లిపురం గ్రామ కాపురస్తులు.