అప్పులు తెచ్చి గ్రామ అభివృద్ధికి వినియోగించాం

Published: Wednesday February 24, 2021

బిల్లులు త్వరగా ఇప్పించండని ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచులు
బిల్లులు వచ్చే వరకు తదుపరి అభివృద్ధి పనులు చేపట్టం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 23 ( ప్రజాపాలన ) : పల్లె ప్రగతే లక్ష్యంగా అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టినా ఇంత వరకు బిల్లులు రాలేవని వికారాబాద్ మండల సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వికారాబాద్ మండల కేంద్రములోని రవీంద్ర మండపంలో సర్వసభ్య సమావేశాన్ని ఎంపిపి కామిడి చంద్రకళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ కామిడి చంద్రకళ మాట్లాడుతూ వికారాబాద్ మండల అభివృద్ధి కోసం అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో పని చేయాలన్నారు. మండలంలో నెలకొని ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని తెలిపారు. పలువురు అధికారులు సర్వసభ్య సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సర్వసభ్య సమావేశానికి వచ్చిన సమస్యలు మళ్ళీ రాకూడదని తెలిపారు. గొట్టిముక్కల ఎంపీటీసీ గోపాల్ మాట్లాడుతూ గొట్టిముక్కల గ్రామంలో అభివృద్ధి శూన్యంగా ఉందని, ఇప్పటి వరకు మిషన్ భగీరథ నీరు ఒక ఇంటికి కూడా అందటం లేదన్నారు. గ్రామంలో చాలా కాలంగా రోడ్డు పూర్తిగా పాడై పోయిందని, దానికి ప్రభుత్వానికి నివేదికలు అధికారులు పంపాలన్నారు. అలాగే పుల్ మద్ది గ్రామంలో విద్యుత్ సమస్యలు ఉన్నాయని దానిని బాగు చేయించాలని సర్పంచ్ తిమ్మాపురం మాధవరెడ్డి తెలిపారు. మదన్ పల్లి గ్రామంలో రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని కో ఆప్షన్ సభ్యుడు జాఫర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సుభాషిణి, వైస్ ఎంపీపీ కొండి రాములు, సర్పంచ్ లు, కార్యదర్శి లు ఉన్నారు.