సమాజ సేవే ... ద లైట్ ఫౌండేషన్ లక్ష్యం

Published: Monday January 30, 2023
* ఆరోగ్య శిబిరాలతో ఉచిత వైద్యం
* క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహం
* అన్నార్థులకు ఆపన్న హస్తం
* ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు తుప్ప ఆనంద్
వికారాబాద్ బ్యూరో 29 జనవరి ప్రజాపాలన : కృషి వుంటే మనుషులు ఋషులవుతారని అన్నాడు ఓ కవి. ఒక పని చేయాలనుకుంటే దానికి సంబంధించిన పక్కా ప్రణాళిక రచన చేసుకోవాలి. ఆ ప్రణాళికను పకడ్బందీగా అమలుపరచుటకు కార్యదీక్ష పట్టుదల అత్యంత ఆవశ్యకం. ఆ ఖోవకు చెందిన వ్యక్తే ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు తుప్ప ఆనంద్. వైద్య వృత్తితో పాటు అదనంగా సమాజ సేవ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. లక్ష్యం నిర్దేశం మంచిదైనప్పుడు భగవంతుని ఆశీస్సులు కూడా మెండుగా ఉంటాయనే నమ్మకంతో  ఫౌండేషన్ కు పునాదులు పడ్డాయి.
2018 లో ద లైట్ ఫౌండేషన్ స్థాపన :  
ద లైట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు, జాతీయస్థాయిలో రాణించే క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహం, అన్నార్థులకు ఆపన్న హస్తం అందించడం, రక్తం సేకరణ శిబిరాలు వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.
* ఆరోగ్య శిబిరాలతో ఉచిత వైద్యం : 
నేటి సమాజం ధనం మూలం ఇదం జగత్ అనే నానుడికి కట్టుబడి ఉంది. ధనాన్ని సంపాదించడం ముఖ్యమే అయినా దాన్నే వ్యసనంగా చేసుకోరాదనుకున్నారు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు తుప్ప ఆనంద్.  తాను సంపాదించిన దానిలో కొంత భాగం సమాజం సేవ వైపు మళ్ళిస్తున్నారు. అందులో భాగంగా దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి ఉచిత వైద్యంతో పాటు ఆర్థికంగా ఆదుకుంటున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు పలు రకాల జబ్బులు వచ్చినప్పుడు డాక్టర్ తుప్ప ఆనంద్ చేతి స్పర్శ తాకితే చాలు జబ్బు నయమవుతుందని ప్రగాఢంగా నమ్ముతారు. మందులతో కాకుండా శారీరకంగా దృఢత్వాన్ని పెంచుకునేందుకు జిమ్ చేయాలని సూచిస్తున్నారు. తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ అన్నారు గురజాడ అప్పారావు. మోమిన్ పేట్ మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అనారోగ్య బాధితులకు ఉచితంగా మందులు వైద్య చికిత్స కొరకు ఖర్చులు భరించారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సకు తనకు తోచిన ఆర్థిక సహకారం అందించారు.
* క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహం : 
జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలంటే ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండాలి. అందుకు తగిన మౌలిక వసతులు, కఠోర శ్రమ సాధించాలనే లక్ష్యం ఉండాలి. గ్రామీణ స్థాయిలో మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి సాన పెడితే మంచి క్రీడాకారులు తయారవుతారు. మన చిన్ననాటి ఆటలు కబడ్డీ, ఖో ఖో, గిల్లి పాన, లగోరి వంటి క్రీడలలో ఎంతో నైపుణ్యంతో ఆడగలిగే స్థాయి గ్రామీణ క్రీడాకారులది. చదువుతోపాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యతను ఇస్తే ఎందరో జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదుగుతారు. గ్రామం, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించే క్రీడాకారులకు ప్రయాణ ఖర్చులు, మౌలిక వసతులు కల్పించడంలో నేనున్నానని భరోసా కల్పిస్తున్నారు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు తుప్ప ఆనంద్. ఒలంపిక్ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు తన సొంత డబ్బులతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి రాబోవు క్రీడాకారులకు ప్రేరణ కలిగించారు.
* అన్నార్తులకు ఆపన్న హస్తం : 
ఆకలితో అలమటించే అన్నార్తులను ఆదుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు డాక్టర్ తుప్ప ఆనంద్. అభం శుభం తెలియని అభాగ్యులను ఆదుకునేందుకు ఎల్లవేళలా అండగా నిలుస్తున్నారు. కనిపెంచిన తల్లిదండ్రులను అనాధాశ్రమాలకు తరలిస్తున్న వృద్ధులను అమ్మానాన్నలను కోల్పోయిన చిన్నారులను సాకడం అనాధాశ్రమాలకు కష్టతరం. అలాంటి సంస్థలకు అన్ని రకాల సహాయ సహకారాలు అత్యంత ఆవశ్యకం. అందులో భాగంగా అనాధలకు దుస్తులు చలిని తట్టుకునే దుప్పట్లు పండ్లు వంటి ఆహార పదార్థాలను అందిస్తున్నారు.
* సామాజిక సేవలను గుర్తించి కేరళలో
డాక్టర్ కలాం ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ అవార్డును 2021 లో మిజోరాం గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై, విశ్రాంత మాజీ ఇస్రో చైర్మన్ డాక్టర్ జి.మాధవన్ నాయర్, కేరళ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కె.ఎస్.శబరినాథన్ స్వహస్తాల మీదుగా బహూకరించారు.
* సమాజ సేవకు వచ్చిన గుర్తింపు పదవులు : 
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ అధ్యక్షుడు, హ్యూమన్ రైట్స్ అడ్వైజర్, తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ లీగల్ అండ్ యాంటీ క్వాకరీ జిల్లా సభ్యులు వంటి పదవులకు వన్నె తెస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా వైద్య వృత్తిని నిర్వహిస్తూ సమాజ సేవను కూడా అదే స్థాయిలో కొనసాగిస్తుండడం విశేషం. ఇలాగే మునుముందు పలు సామాజిక సేవా కార్యక్రమాలు  చేపట్టుటకు భగవత్ ఆశీస్సులు మెండుగా లభించాలని ఆకాంక్షిద్దాం.