వరిలో తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలివ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు

Published: Monday September 19, 2022

మధిర సెప్టెంబర్ 18 ప్రజాపాలన ప్రతినిధి వరి నాట్లు ఆలస్యంగా వేయడం వల్ల వరి పంటపై వివిధ రకాల తెగుళ్లు ఆశించే అవకాశం ఉందని వాటిని నివారించేందుకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ప్రొఫెసర్ జయశంకర్ మధిర వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచించారు. ఆదివారం వరి పంటలను  పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాక్టీరియా ఎండాకు తెగులు అధికంగా ఆశించే అవకాశం ఉందని దీని నివారణకు నత్రజని ఎరువుల వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాములు, ప్లాంటమైసిన్ లేక పోష మైసిన్ 0.4 మిల్లి గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. చిరు పొట్ట దశలో ఉన్న వరి పైరు పై కాండం తొలిచే పురుగు, ఆకు ముడత, రెక్కల పురుగులు ఆశించే అవకాశం ఉందని వీటి నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు లేక క్లోరంట్రా నిలిప్రోలు 60 మిల్లీ లీటర్లు ఎకరాకు పిచికారి చేయాలన్నారు. వరి నాట్లు ఆలస్యంగా వేయడం వలన సుడిదోమ , సోమపొడ, ఉల్లికూడు తెగులు, కాండం తొలిచే పురుగులు ఆశించే అవకాశం ఉందని వీటి నివారణకు ఫైరు నాటిన 15 నుండి 25 రోజుల మధ్యలో కార్బొప్యురాన్ 3జి గుళికలు లేదా తిపోలో 3జి గుళికలు ఎకరాకు 8 కిలోల చొప్పున సమానంగా చల్లాలని వారు ఈ సందర్భంగా తెలిపారు. వరి పంటను పరిశీలించిన వారిలో పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రుక్మిణి దేవి శాస్త్రవేత్తలు డాక్టర్ జి వేణుగోపాల్  కె నాగస్వాతి తదితరులు ఉన్నారు.