విద్యను వ్యాపారం చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి

Published: Friday July 01, 2022
ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్ 
 
 
మంచిర్యాల టౌన్, జూన్ 30, ప్రజాపాలన : పాఠశాల విద్యను పూర్తిస్థాయిలో వ్యాపారంగా మార్చి అక్రమ దోపిడి చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిసిసి లోని కామ్రేడ్ నరసయ్య భవన్ ముందు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్, చేరల వంశీ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి విద్యను వ్యాపారం కేంద్రాలుగా మార్చుతున్నాయని, ఆయా పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం ఫీజులను భారీగా పెంచి, పుస్తకాలు, షూస్, పెన్నులు పేరుతో వ్యాపారం చేస్తున్న జిల్లా విద్య అధికారి, మండల విద్య అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగానే ప్రైవేట్ విద్యాసంస్థలు రెచ్చిపోయి ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్ల పీల్చి పిప్పి చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రైవేటు పాఠశాలలు బస్సు ఫీజు గత సంవత్సరం రూ.6000/- నుండి రూ.7000/- ఉండగా ఈ ఏడాది దానిని రూ.12,000/- నుండి రూ.15000/- ల వరకు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు, ఈ ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్య వ్యాపార కేంద్రాలుగా మార్చిన కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని లేదంటే డిఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు రాము, ప్రమోద్, సంతోష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.