సుప్రీం కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రులు.

Published: Wednesday October 27, 2021
హైదరాబాద్, అక్టోబర్ 26, ప్రజాపాలన ప్రతినిధి : మాలమహానాడు ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర మంత్రులు ఎస్సీ వర్గీకరణకు మరియు సుప్రీం కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రుల వాక్యాలకు నిరసనగా మాలమహానాడు ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. తేదీ: 25-10-2021 నాడు హైదరాబాదులో జరిగిన మాదిగ ఉద్యోగుల సమాఖ్య సభలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు జి‌.కిషన్ రెడ్డి, సామాజిక సాధికారత సహాయ మంత్రి వర్యులు నారాయణస్వామి మరియు కేంద్ర పశు సమృద్ధి శాఖ మరియు సమాచార శాఖ సహాయ మంత్రులు ఎల్. మురుగన్ ఈ సభలో మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ కు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కాశ్మీర్ లో 370 ఆర్టికల్ మాదిరిగా ఎస్సీల వర్గీకరణ చేస్తామని మరియు దీనిపై 2004 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించుటకు ఏడు లేదా తొమ్మిది మంది న్యాయమూర్తులతో బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీల వర్గీకరణకు మరింత తోడ్పాటు అందిస్తామని ముగ్గురు కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించడం సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించడం అన్నారు. సుప్రీం కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా మాట్లాడిన ముగ్గురు కేంద్రమంత్రులపై కోర్టు ధిక్కరణ కింద కేసులు నమోదు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు. గతంలో పార్లమెంట్ సాక్షిగా మోడీ ప్రభుత్వం ఆ శాఖ మాత్యులు పార్లమెంటులో మాట్లాడుతూ వర్గీకరణ జాతీయ సమస్యని మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని కావున ఇది సాధ్యపడదని తెలిపారు. కేంద్ర మంత్రులు అన్నదమ్ముల వలె కలిసి ఉన్న మాల మాదిగల మధ్య చిచ్చుపెట్టి ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారని ఈ సందర్భంగా చెన్నయ్య మండిపడ్డారు. రాజ్యాంగానికి ఎస్సీ కమిషన్ తీర్పునకు సుప్రీం కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తున్న కేంద్ర మంత్రులను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. వీరిపై కోర్టు ధిక్కరణ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం వచ్చాక దళితులపైన మానసిక భౌతిక సాంస్కృతిక దాడులు ఎక్కువ అయ్యాయన్నారు. రాజ్యాంగ రక్షణలు కరువయ్యాయని పీడిత వర్గాలు ఏకం కాకుండా రాజ్యాధికారానికి దూరంగా ఉండే విధంగా మనువాదుల కుట్రే ఎస్సీ వర్గీకరణ అని వ్యాఖ్యానించారు. బిజెపి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ ముగ్గురు కేంద్ర మంత్రులను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి కేసులు నమోదు చేయాలన్నారు. ఈ మేరకు రాష్ట్రపతికి ప్రధానమంత్రి మరియు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య ఈ సందర్భంగా తెలిపారు. ఈ మహా ధర్నా కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి రవి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుందా మల్లికార్జున్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు కావాలి రమేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిక్కుడు గుండాలు, యూత్ అధ్యక్షుడు జి.రమేష్ మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాల మహానాడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.