రైతు దేశానికి వెన్నుముక

Published: Friday December 24, 2021

ఘనంగా జాతీయ రైతు దినోత్సవం

మున్నూరు కాపు సంఘం, రైతులకు సన్మానం
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి డిసెంబర్ 23 (ప్రజాపాలన) : రైతు దేశానికి వెన్నుముక్క అని మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు గడ్డల సురేష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పలువురు రైతులను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గడ్డల సురేష్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పని చేస్తున్నారని రైతు లేనిదే రాజ్యం లేదని అన్నారు. రైతులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. రైతులకు ఉచిత ఎరువులు, విత్తనాలు, రాయితీపై అందజేయాలని, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ప్రాజెక్టుల కాలువలకు మరమ్మతులు చేయించి రైతులకు సాగునీరు అందించాలని అన్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని, వ్యవసాయ శాఖ అధికారులు భూసార పరీక్షలు చేయించి, రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించి పంట మార్పిడి చేయించాలన్నారు. రైతు బాగు పడ్డప్పుడే రాజ్యం బాగుపడుతుందన్నారు. రైతు జాతీయ దినోత్సవాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు గుర్రాల వెంకటేశ్వర్లు (ఆకాశం) మిట్ట పోషణ, ప్రదీప్,చిట్ల నారాయణ, వెంకటేష్, సదాశివ, ఆడపా సతీష్, (జర్నలిస్ట్) మల్లేష్, గణపతి, తదితరులు పాల్గొన్నారు.