అశాశ్వతమైనది జీవితం

Published: Thursday July 22, 2021
రాళ్ళచిట్టంపల్లి సర్పంచ్ ముఫ్లయా యాస్మిన్ బేగమ్
వికారాబాద్, జులై 21, ప్రజాపాలన ప్రతినిధి : మోహావేశాలకు ఆకర్షితులయ్యేవారు సామాన్యులు. వీరు సర్వదా కోరుకునేవి- శారీరక సుఖసౌఖ్యాలు, జిహ్వ చాపల్యాన్ని తీర్చే ఆహారాలు, డాంబికాన్ని ప్రదర్శించేందుకు సిరిసంపదలు. ఇహలోకంలో తమ ప్రస్థానం బహుకొద్ది కాలమేనని గ్రహించి సర్వాంతర్యామి కరుణా కటాక్షాలకోసం పరితపించేవారు జ్ఞాన సంపన్నులు. తాము విశ్వసించిన అల్లాహ్‌ ఆరాధనతో స్వీయ సమర్పణ గావించుకొని పరలోక ప్రయాణానికి సంసిద్ధులు కాగలిగేవారు ధన్యజీవులు. చరాచర సృష్టికి ఆధారభూతుడు అల్లాహ్‌ రాజ్యాధికారం ఆకాశాలను, భూములను ఆవరించుకొని ఉంది. ఆయన సర్వాధికుడు, నిరాకారుడు, సర్వోత్తముడని పవిత్ర ఖురాన్‌ గ్రంథంలోని సూరె బఖర తెలుపుతుంది. ‘జీవన్మరణాలు ఎవరి అధీనంలో ఉన్నాయో ఆయనే నా ప్రభువు అల్లాహ్‌’ అని ప్రకటించిన ఇబ్రహీం(అ.స.) ప్రవక్తల పితామహుడిగా పేరుపొందారు. స్తోమత కలిగిన ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా కాబా గృహాన్ని దర్శించాలన్నది ఇస్లాం మూలసూత్రాలలో ఒకటి. పన్నెండో నెల జుల్‌హిజ్జా బక్రీదునెలలో హజ్‌తీర్థ యాత్ర చేస్తారు. కాబా గృహం చుట్టూ మూడులక్షల యాభైఆరువేల ఎనిమిదివందల చదరపుమీటర్ల వైశాల్యంలో నిర్మించిన మస్జిద్‌ - అల్‌ - హరమ్‌లో నమాజు చేస్తారు. ఈ పవిత్ర యాత్రచేసే వారు దుష్కార్యాలకు ఘర్షణలకు దూరంగా ఉండాలి. కాబా గృహదర్శనంతో బక్రీదు పర్వదినం రోజున సకల శుభాలు చేకూరుతాయని, అల్లాహ్‌ రక్షణ పొందిన దివ్యానుభూతితో వారు పునీతులవుతారు.