ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

Published: Tuesday April 04, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 3 ఏప్రిల్ ప్రజా పాలన : 
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చేసిన ప్రజల నుండి వారి సమస్యలపై 316 ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు.  వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేసి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అంతకుముందు జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 5, 11, 14 తేదీలలో వరసగా మహా నీయులైన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, మహాత్మ జ్యోతిబాపూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఉన్నందున అధికారులందరూ ఇట్టి కార్యక్రమాలలో పాల్గొని కార్యక్రమాలను పండగ వాతావరణంలో నిర్వహించాలన్నారు.  మున్సిపల్ గ్రామపంచాయతీ గల విగ్రహాలకు రంగులు వేయాలని, పరిసరాలలో పారిశుధ్యం పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.  ప్రభుత్వ ఉద్యోగులందరూ పారదర్శకంగా పనిచేసే విధంగా అటెండెన్స్ యాప్ ను అధికారులు పకడ్బందీగా అమలు పరచడం జరుగుతుందన్నారు.  అటెండెన్స్ యాప్ తో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు.  ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, డి ఆర్ డి ఓ కృష్ణన్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.