విద్యతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి

Published: Tuesday October 26, 2021
జిల్లా విద్యాశాఖ అధికారిణి జి.రేణుక దేవి
వికారాబాద్ బ్యూరో 25 అక్టోబర్ ప్రజాపాలన : విద్యతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలని జిల్లాలోని ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారిణి జి. రేణుక దేవి సూచించారు. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా పిల్లల్లో సాంస్కృతిక, సాంప్రదాయాల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ మేరకు జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్, కేజీబీవీలు, టిఎస్ఎంఎస్ లు మరియు ప్రైవేట్ పాఠశాలల్లోని 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులకు కళా ఉత్సవం పేరిట వివిధ కేటగిరీలలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తొమ్మిది విభాగాలలో పోటీలు ఆన్ లైన్ ద్వారా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి విభాగంలో ఒక బాలిక, ఒక బాలుడు అన్ని మండలాల నుండి జిల్లా కార్యాలయానికి అనగా మొత్తం 18 మందిని ఈ నెల 27 వరకు జిల్లా స్థాయి పోటీలకు పంపాలని తెలిపినారు. జిల్లా స్థాయిలో 28 నుండి 30 వరకు ఆన్ లైన్ ద్వారా వచ్చిన విజేతల నుండి రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది. విజేతలకు రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులు అందిస్తారని తెలియజేయడం జరిగింది. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు తప్పనిసరిగా వారికి సంబంధించిన 5 నిమిషాల వీడియో, 100 పదాలతో (హిందీ ఇంగ్లీష్) వ్యాసాలను పాల్గొన్న పోటీలకు సంబంధించిన వీడియోలను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం యొక్క మెయిల్ ssvikarabad@gmail కు పంపించగలరు. విభాగాలు: వోకల్ మ్యూజిక్ గాత్ర సంగీతం (క్లాసికల్), వోకల్ మ్యూజిక్ గాత్ర సంగీతం (జానపదం), వాయిద్య సంగీతం (క్లాసికల్), వాయిద్య సంగీతం సంప్రదాయ జానపదం, నృత్యం క్లాసికల్, నృత్యం జానపదం, దృశ్య కళ (2D) డ్రాయింగ్, దృశ్య కళ (3D) శిల్పకళ, సాంప్రదాయ ఆటలు, బొమ్మలు.