ఆధ్యాత్మిక చింతనతోనే మానవ మనుగడకు సాఫల్యత

Published: Friday December 23, 2022
చిగుళ్ళపల్లి గ్రౌండులో అతిరుద్ర మహాయజ్ఞ సప్తాహం
వికారాబాద్ బ్యూరో 22 డీసెంబర్ ప్రజాపాలన : ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక చింతనతో మనస్సుకు ఏకాగ్రత సిద్ధిస్తుంది. నేటి ఆధునిక జీవన సరళిలో మానవులు ఒక యంత్రంలా మారుతున్నారు. మేధస్సును ఉత్తేజపరిచే శక్తి సామర్థ్యాలు యజ్ఞ యాగాదులలో ఉద్భవించే ధూమం ద్వారా పొందుతారు. వేద మంత్రోచ్ఛారణలతో మానవ శరీరం ఉత్ప్రేరకంగా ఉత్తేజితమవుతుంది. ఒక్కొక్క వేద మంత్రం ఒక్కో శక్తిని ప్రాప్తిస్తుంది. వేదశాలలో తిరిగినా వేద మంత్రాలు వినినా మానవ జన్మ సార్థకం అవుతుంది. ఎన్నో పుణ్య కార్యాలు చేసిన మోక్షం లభించదు. యజ్ఞ యాగాదులలో రుద్రాభిషేకం, నమ్మకం, చమకం, శ్రీసూక్తం, పురుష సూక్తం వంటి వేద మంత్రాలతో యజ్ఞ ప్రాంగణం అంతా ప్రతిధ్వనిస్తుంది. వికారాబాద్ ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అతిరుద్ర మహా యజ్ఞ సప్తాహం దిగ్విజయంగా రెండవ రోజు పూర్తి చేసుకుంది. యజ్ఞ యాగాన్ని చూసి తరించడానికి భక్తులు తండోపతండాలుగా చిగుళ్లపల్లి మైదానానికి తరలివచ్చి ఆనందించారు. పుర ప్రముఖులతోపాటు సామాన్య ప్రజానీకం కూడా యజ్ఞ యాగం లో పాల్గొనడం విశేషం.