వైభవంగా సమ్మక్క సారలమ్మల విగ్రహప్రతిష్ఠ మహోత్సవం..

Published: Friday February 04, 2022
తల్లాడ, ఫిబ్రవరి 3 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని అంజనాపురం గ్రామంలో సమ్మక్క, సారక్క విగ్రహప్రతిష్ఠ మహోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. పెద్ద పండుగైన మేడారం జాతరను పురస్కరించుకొని ఈ విగ్రహాలను ప్రతిష్ఠింప చేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని సమ్మక్క సారలమ్మలకు  ముడుపులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. అంజనాపురం గ్రామంలోని పూజారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మల గద్దెలు ఏర్పాటుచేసి గుడి నిర్మాణ పనులు చేపట్టారు. అనంతరం పూజారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భక్తులకు సమ్మక్క, సారలమ్మల దీవెనలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా భక్తులకు మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మరో రెండు రోజులపాటు కూడా వేడుకలు ఉంటాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాజేష్, నరసయ్య, రాజా, చందు, స్థానిక ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.