ఇంటింటికి సురక్షితమైన మిషన్ భగీరథ నీరు అందించాలి

Published: Saturday June 18, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో జూన్ 17 ప్రజాపాలన : 
ఇంటింటికి సురక్షితమైన మిషన్ భగీరథ నీరు అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల, అనుబంధ గ్రామం ఐనాపూర్ గ్రామాలలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారెగూడెం కమాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ పట్లే వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ మల్లేశం, కార్యదర్శి రామ్ రెడ్డిలతో కలిసి ఉదయం 6:30 గంటల నుండి 11గంటల వరకు పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐనాపూర్ గ్రామంలో సీసీ రోడ్లు మరియు మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఐనాపూర్ గ్రామంలో పశు వైద్య అధికారి వారానికి ఒక రోజు రైతులకు అందుబాటులో ఉండాలని పశువైద్య శాఖ వారిని ఆదేశించారు.  గొట్టిముక్కల వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడానికి గుంతలు తీస్తున్న ఉపాధిహామీ కూలీల దగ్గరికి వెళ్లి  రోడ్డుకు కొంచెం దూరంలో గుంతలు తీయాలని సూచిస్తూ పని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పశువైద్య  కాంపౌండర్ గొట్టిముక్కల గ్రామంలో రైతులకు అందుబాటులో ఉంటూ మంచి సేవలు అందిస్తున్నారని ప్రజలు తెలుపగా ఎమ్మెల్యే అభినందించారు. గొట్టిముక్కల గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉందని గ్రామ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి మంచినీటి నల్లా కనెక్షన్ ఇవ్వాలని సూచించారు. చెర్రలు బిగించి, గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి, ప్రతీ ఇంటికి కచ్చితంగా మిషన్ భగీరథ నీటి సరఫరా చేయాలని స్పష్టం చేశారు. లీకేజీలు లేకుండా నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు సురక్షితమైన మిషన్ భగీరథ మంచి నీటినే త్రాగాలని హితవు పలికారు. గ్రామంలోని బావులపై పైకప్పులు ఏర్పాటుచేసి, 5వ విడత పల్లె ప్రగతి పనులను నిర్లక్ష్యం చేయకుండా పాడుబడ్డ ఇండ్లు, పెంట కుప్పలు, పిచ్చి మొక్కలు మొదలైన వాటిని శుభ్రం చేసి, గ్రామంలో పరిసర ప్రాంతాలన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గ్రామంలో మరియు పంట పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేసి మంజూరైన ట్రాన్స్ఫార్మర్ ను బిగించి, ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సేవలు అందించాలని విద్యుత్ శాఖ వారిని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని రైతులకు కంది విత్తనాల మినీ కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కామిడీ చంద్రకళ కమాల్ రెడ్డి, ఎంపిడిఓ మల్గ సత్తయ్య, మండల రెవెన్యూ అధికారిణి షర్మిల, ఎంపీఓ నాగరాజు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మేక చంద్రశేఖర్ రెడ్డి, మండల సర్పంచ్ లు వికారాబాద్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ గయాజ్ మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సత్తయ్య గౌడ్, మాజీ జెడ్పిటిసి పట్లే శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.